సాగు చట్టాలపై 11వ రౌండ్ చర్చల్లో కూడా వీడని ప్రతిష్ఠంభణ

సాగు చట్టాలపై 11వ రౌండ్ చర్చల్లో కూడా వీడని ప్రతిష్ఠంభణ

farmers నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిన 11వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. నేటి చర్చల్లోనూ రైతుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. అయితే మరోదఫా చర్చలు ఎప్పుడనే విషయంపై స్పష్టత రాలేదు. రైతుల నిర్ణయం చెబితే మళ్లీ చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

రైతు సంఘాలకు సాధ్యమైనన్ని అవకాశాలు ఇచ్చామని తోమర్ అన్నారు. చట్టంలో లోపం లేనప్పటికీ కొన్ని ప్రతిపాదనలు చేశాం. ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతులు నిర్ణయం తీసుకోలేదు. ఒక నిర్ణయానికి వచ్చి, మాకు తెలియజేస్తే మళ్లీ చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అని వ్యవసాయ మంత్రి తోమర్ అన్నారు. అయితే చట్టాల రద్దు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని రైతులు తేల్చిచెప్పారు.

కాగా, సాగు చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని.. రెండు రోజుల క్రితం జరిగిన 10వ దఫా చర్చల్లో కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై ఆలోచించి చెబుతామని చెప్పి రైతులు భేటీని ముగించారు. అయితే ఈ ప్రదిపాదనను రైతులు తిరస్కరించారంటూ గురువారం మీడియాలో వార్తలొచ్చాయి. ఈ విషయమై ఇవాళ చర్చల సమయంలో రైతు నేతలపై వ్యవసాయశాఖ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరిస్తూ రైతులు పత్రికా ప్రకటన విడుదల చేయడంపై తోమర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తే.. ఆ విషయం సమావేశానికి వచ్చి చెప్పాలి కానీ ముందుగా మీడియాకు చెప్పడమేంటని తోమర్​ రైతు నేతలను ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.