Heavy rains in Delhi : ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు .. ఎల్లో అలర్ట్ జారీ

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులగా భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. వర్షాలు మరింతగా కురిసే అవకాశాలు ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది.

Heavy rains in Delhi : ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు .. ఎల్లో అలర్ట్ జారీ

Heavy rains in Delhi

Heavy rains in Delhi : దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులగా భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఢిల్లీ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ భారీగా జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం అవ్వడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గురువారం (సెప్టెంబర్ 22,2022) భారీ వర్షాల కారణంగా ఇఫ్కో చౌక్, శంకర్ చౌక్, రాజీవ్ చౌక్, గుర్గావ్-ఢిల్లీ సరిహద్దు సమీపంలోని జాతీయ రహదారిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో 3, 4 గంటలపాటు భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వర్షాలు విస్తారంగా కురుస్తున్ క్రమంలో శుక్రవారం నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. హర్యానాలో ప్రభుత్వ విపత్తు నిర్వహణ అథారిటీ..గుర్గావ్‌లోని కార్యాలయాలు, కార్పొరేట్‌లను శుక్రవారం ఇంటి నుంచి పని చేయమని ఉద్యోగులను కోరుతూ నోటీసును విడుదల చేసింది. ఢిల్లీలో పాఠశాలలకు సెలవుపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, చాలా ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇచ్చినట్టు తల్లిదండ్రులకు సందేశాలు వచ్చాయి. గుర్గావ్, ఫరీదాబాద్ జిల్లాల్లోనూ ఇదే విధంగా పలు ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించాయి.

ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో శుక్రవారం మరింతగా వర్షం కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల సాధారణంగా మేఘావృతమైన ఆకాశం, మోస్తరు వర్షం..ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీల సెల్సియస్‌, 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.