CAAతో మహాత్ముడి కల సాకారం : మళ్లీ చెబుతున్నా.. పౌరసత్వం ఇచ్చేది, రద్దు చేసేది కాదు

దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని

  • Published By: veegamteam ,Published On : January 12, 2020 / 06:20 AM IST
CAAతో మహాత్ముడి కల సాకారం : మళ్లీ చెబుతున్నా.. పౌరసత్వం ఇచ్చేది, రద్దు చేసేది కాదు

దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని

దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఏఏపై నెలకొన్న భయాలను, సందేహాలను నివృత్తి చేసే యత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ఏ ఒక్కరు కూడా పౌరసత్వ హక్కుని కోల్పోరని తేల్చి చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం.. పౌరసత్వం ఇచ్చేది… రద్దు చేసేది కాదని అన్నారు. CAAపై లేని పోని అపోహలు వద్దన్నారు ప్రధాని మోడీ. రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్షాలు సీఏఏపై తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని ఆరోపించారు. పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఆదివారం(జనవరి 12,2020) హౌరాలో బేలూర్ మఠం సందర్శించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నివాళి అర్పించారు. దేశ యువతను ఉద్దేశించి మాట్లాడారు.

వేధింపులకు గురైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించడమే సీఏఏ ఉద్దేశమని ప్రధాని అన్నారు. సీఏఏ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువత తెలుసుకోవాలన్నారు. మన చుట్టూ ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, అలాంటి అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో యువత విసిగి వేసారి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటన్నింటికి వాస్తవ సమాచారంతో జవాడు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పౌరసత్వ చట్టం ఒక్క రాత్రిలో తీసుకొచ్చింది కాదనే విషయం ఈశాన్య ప్రాంతాల ప్రజలు, బెంగాల్ ప్రజలు గ్రహించాలని ప్రధాని కోరారు.
 
‘వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చిన వారెవరైనా భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే వారు దేశ పౌరులే అవుతారనే విషయం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. సీఏఏ అనేది దానికి సవరణ మాత్రమే. ఇతర దేశాల్లో కష్టాలు పడుతున్న వారికి పౌరసత్వం కల్పించేందుకు మార్గం సుగమం చేస్తూ సీఏఏలో మార్పులు చేశాం’ అని ప్రధాని మోడీ వివరించారు. సీఏఏ ద్వారా మైనారిటీలకు బాసటగా నిలవాలన్న మహాత్మాగాంధీ ఆశయాలను, కలలను తమ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. పాకిస్తాన్, ఇతర దేశాల్లో చిత్రహింసలకు గురైన ప్రజలకు భారత్ లో మానవతా దృక్పథంతో పౌరసత్వం కల్పించాలని మహాత్మాగాంధీతో పాటు ప్రభుత్వంలోని పలువురు పదేపదే చెబుతూ వచ్చారని మోడీ గుర్తు చేశారు.

జనవరి 10వ తేదీ 2020 నుంచి పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంతో 3 దేశాల(బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌) ముస్లిమేతరులకు ప్రయోజనం కలగనుంది. వారు భారత పౌరసత్వం పొందనున్నారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర హోంశాఖ తెలిపింది. 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్‌కు చెందిన హిందువు, సిక్కు, బుద్దులు, జైనులు, పర్షి, క్రిస్టియన్లు.. పౌరసత్వం కోసం ఇబ్బంది పడుతుంటే.. వారు అక్రమ వలసదారులు కాదని, వారికి పౌరసత్వం ఇస్తామని చట్టం చెబుతోంది.

కానీ సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దేశంలో తొలిసారి కులం ఆధారంగా పౌరసత్వం ఇవ్వబోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ దేశాలకు చెందిన మైనార్టీలు అక్కడ మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారని, వారు భారత దేశం రావడం తప్ప మరో మార్గం లేదని, అందుకే సీఏఏ తీసుకొచ్చామని బీజేపీ వాదిస్తోంది.

Also Read : ICUలో ఎకానమీ.. బీజేపీకి కాసుల వర్షం : ఆదాయం@రూ.2,410 కోట్లు