ఇమ్రాన్ వ్యాఖ్యలు..పచ్చి అబద్దాలు

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 02:03 PM IST
ఇమ్రాన్ వ్యాఖ్యలు..పచ్చి అబద్దాలు

 పుల్వామా ఉగ్రదాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ..తమదే అతిపెద్ద ఉగ్రవాద భాధిత దేశమని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇది పూర్తిగా అసత్యం. ఉగ్రవాదానికి పాక్ ప్రధాన కేంద్రమన్న నిజం అంతర్జాతీయ సమాజానికి తెలిసిన విషయమేనని అన్నారు.

 పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశం అని చెప్పి.. ఇమ్రాన్ ఖాన్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. పుల్వామా దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని కబుర్లు చెప్పిన ఇమ్రాన్ ఖాన్.. అసలు దాడిని ఎందుకు ఖండించలేదో చెప్పాలని అన్నారు. నయా పాక్ లో ఐక్యరాజ్యసమితి నిషేధించిన హఫీజ్ సయాద్ వంటి ఉగ్రవాదులతో పాక్ మంత్రులు బహిరంగానే వేదికలు పంచుకుంటున్నారన్నారు.పుల్వామా దాడిలో పాక్ పాత్రపై తమ వద్ద సరైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

పుల్వామా దాడి చేసింది తామేనని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం ఇంతకుముందు చాలా ఆధారాలను  పాక్ ప్రభుత్వానికి ఇచ్చిందని, కానీ ఎలాంటి ఫలితం లేదని అన్నారు.