Bharat: ఇండియా పేరును ఎలా మార్చుతారో తెలుసా? రాజ్యాంగం ఏం చెబుతోంది?

కేంద్ర ప్రభుత్వం దేశం పేరును కేవలం భారత్‌గానే ఉంచుతూ ఇండియా పదాన్ని తొలగిస్తుందా? ఇదే ఇప్పుడు తలెత్తుతోన్న ప్రశ్న.

Bharat: ఇండియా పేరును ఎలా మార్చుతారో తెలుసా? రాజ్యాంగం ఏం చెబుతోంది?

India or Bharat

Bharat – India: దేశంలో నిర్వహించనున్న జీ20 డిన్నర్ ఆహ్వాన పత్రికలో ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హోదాను పేర్కొనడంతో దేశం పేరులో ఇండియాను తొలగించి భారత్‌ను మాత్రమే ఉంచుతారని ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పేర్కొనేవారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నేతలు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

దేశం పేరు ఇండియా? లేదా భారత్?

దీని గురించి మన రాజ్యాంగం ఏం చెబుతుందో తెలుసా? ‘ ఇండియా, అదే భారత్, రాష్ట్రాల సమాహారంగా ఉంటుంది ’ అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 తెలుపుతోంది. ఇండియా, భారత్‌ ఈ రెండింటినీ దేశం పేర్లుగా రాజ్యాంగం గుర్తించింది. దేశం పేరును కేవలం భారత్‌గానే ఉంచుతూ ఇండియా పదాన్ని తొలగిస్తుందా? ఇదే ఇప్పుడు తలెత్తుతోన్న ప్రశ్న.

ఇండియా పేరును భారత్‌గా మార్చాలంటూ 2016 మార్చిలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ యుయు లలిత్ తో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఇటువంటి పిటిషన్లను విచారణకు స్వీకరించబోమని స్పష్టం చేసింది.

భారత్ లేదా ఇండియా? ఈ రెండింటిలో దేశాన్ని ఏ పేరుతో పిలవాలనుకుంటే ఆ పేరుతో పిలవవచ్చని తెలిపింది. పిటిషనర్ దేశాన్ని భారత్ అని పిలవాలనుకుంటే అదే విధంగా పిలవవచ్చని, ఇతరులు ఎవరైనా ఇండియాగా పిలవాలనుకుంటే అలాగే పిలవచ్చని పేర్కొంది.

నాలుగేళ్ల తర్వాత అంటే 2020లో దేశం పేరును మార్చాలన్న అటువంటి పిటిషనే సుప్రీంకోర్టులో మళ్లీ దాఖలైంది. ఈ పిల్ ను ఓ నివేదనా పత్రంగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామని, ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఆ సమయంలోనే భారత్, ఇండియా రెండు పేర్లు రాజ్యాంగంలో ఉన్నాయని గుర్తుచేసింది.

ఇప్పుడు ఏం చేస్తారు?
అధికారికంగా దేశం పేరును భారత్‌గా మాత్రమే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కేంద్ర సర్కారు రాజ్యాంగంలోని అర్టికల్ 1ని సవరించేందుకు బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సాధారణ మెజార్టీ లేదా ప్రత్యేక మెజార్టీ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ను సవరించేకునే అవకాశాన్ని ఆర్టికల్ 368 ఇస్తుంది.

కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ సీట్లు, రాజ్యసభ సీట్లు వంటి వాటికి సంబంధించిన ఆర్టికల్స్ లో సాధారణ మెజార్టీతో సవరణలు చేయొచ్చు. అంటే 50 శాతం మంది సభ్యుల కంటే ఎక్కువ మంది సభ్యులు అంగీకరిస్తే సరిపోతుంది. ఆర్టికల్ 1లో ఏదైనా సవరణలకు (దేశం పేరును మార్చేందుకు చేయాల్సిన సవరణ ఇందులోదే) ప్రత్యేక మెజార్టీ ఉండాలి. అంటే 66 శాతం మెజార్టీతో ఆమోదింపజేసుకోవాలి.

Bharat Name Row: భారత్ పేరు మార్పుపై ఓవైపు తీవ్ర వివాదం సాగుతోంది.. ఇంతలో మరోకొత్త పేరు చెప్పిన అస్సాం సీఎం