ప్రశాంత్ కిషోర్ ‘కరోనా వైరస్’ లాంటి వాడు

  • Published By: vamsi ,Published On : January 29, 2020 / 11:46 PM IST
ప్రశాంత్ కిషోర్ ‘కరోనా వైరస్’ లాంటి వాడు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే అతనిని తొలిగించిన వెంటనే ప్రశాంత్ కిషోర్‌కు సొంత పార్టీ నుంచే తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈక్రమంలోనే ఆయనను ‘కరోనా వైరస్’తో పోల్చారు జేడీయూ నేత అజయ్ అలోక్. ప్రశాంత్ కిషోర్ అంత నమ్మదగినవాడు కాదని, మోడీజీ, నితీష్‌జీ విశ్వాసాన్ని ఆయన పొందలేకపోయారని అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆప్ తరఫున పనిచేస్తారు, రాహుల్ గాంధీతో మాట్లాడతారు, మమతా దీదీతో కూర్చుంటారు. ఆయనను నమ్మేదెవరు? ఈ కరోనా వైరస్ మమ్మల్ని వదిలిపోతే సంతోషిస్తాం. ఆయన ఎక్కడకు వెళ్లాలనుకుంటే అక్కడకు వెళ్లొచ్చని అజయ్ అలోక్ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. 
 
కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సింహభాగం సీట్లు తమకు కేటాయిస్తేనే బీజేపీతో పొత్తు లేకుంటే లేదు అన్నట్లు ప్రశాంత్ కిషోర్ అనడం.. అలాగే, సీఏఏ, ఎన్ఆర్సీ వంటి విషయాల్లో మిత్రపక్షం బీజేపీపైనే యుద్ధానికి దిగుతుండటం,కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై ప్రశంసలు కురిపించడం వంటి చర్యలతో ప్రశాంత్ కిషోర్‌పై చర్యలు తీసుకుంది ఆ పార్టీ.