సంక్షోభంలో కమల్‌నాథ్ సర్కార్.. రాజీనామా ప్రకటించిన 22 మంది మంత్రులు

సంక్షోభంలో కమల్‌నాథ్ సర్కార్.. రాజీనామా ప్రకటించిన 22 మంది మంత్రులు

మధ్యప్రదేశ్‌లోని 22మంత్రుల రాజీనామా అనంతరం కొత్త క్యాబినెట్ ఏర్పాటులో పడ్డారు సీఎం కమల్‌నాథ్. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికార ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వ్యూహాలు రచిస్తోందన్నారు. బీజేపీ మాఫియా సపోర్టుతో కాంగ్రెస్ పతనం కోసం ప్రయత్నిస్తుందని వాటిని తాను ఒప్పుకోననన్నారు. తన అంతిమ లక్ష్యం పదవులు కాదని, ప్రజాసేవేనని అన్నారు. 

పార్టీ అధికారాన్ని తారుమారు చేస్తున్న 12మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కమల్‌నాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ముందుగా రాజీనామాలకు వెంటనే ఆమోద ముద్ర వేసిన కమల్‌నాథ్ తిరిగొస్తే వారి మంత్రి పదవులు అప్పగిస్తానని హామీ ఇచ్చారు. 

‘నా జీవితమంతా ప్రజాసేవకే అంకితమిచ్చాను. అధికార దాహంతో ఇక్కడికి రాలేదు. ప్రజాసేవే లక్ష్యంగా వచ్చాను. 15ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజలను పట్టించుకోలేదు. ఇప్పటికీ అధర్మ బద్ధంగా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంది’ అని విమర్శించారు. రాజ్య సభ ఎన్నికలకు ముందు జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు, బెంగళూరు వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు సీఎం. 

మొత్తం230 సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 114,బీజేపీకి 107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సమయంలో ఇప్పుడు ఈ 18మంది కమల్ నాథ్ సర్కార్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సింధియా వర్గం వారే కావడం గమనార్హం. ఇంత జరుగుతున్న ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. దీంతో ఈ సంక్షోభానికి సింధియానే కారణమని కాంగ్రెస్‌లోని ఓ వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది.