కమల్ నాథ్ కి ఎన్నికల కమిషన్ బిగ్ షాక్

  • Published By: venkaiahnaidu ,Published On : October 30, 2020 / 08:16 PM IST
కమల్ నాథ్ కి ఎన్నికల కమిషన్ బిగ్ షాక్

Kamal Nath No Longer “Star Campaigner” వచ్చే వారంలో ఉప ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కమల్ నాథ్ ని స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ని రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పదే పదే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం,ఎన్నికల కమిషన్ చేసిన హెచ్చరికలను పూర్తిగా బేఖాతరు చేసిన నేపథ్యంలో కమల్ నాథ్ కి ఉన్న స్టార్ క్యాంపెయినర్ స్టేటస్ ని తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం ఇవాళ(అక్టోబర్-30,2020)ఓ ప్రకటనలో పేర్కొంది.



ఇక,ఇప్పటినుంచి కమల్ నాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే…ఆయన ప్రయాణ,బస సహా మొత్తం ఖర్చు…ఆయన ఏ నియోజకవర్గంలో అయితే క్యాంపెయిన్ చేస్తున్నారో ఆ నియోజకరవ్గంలో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తన ఎన్నికల ఖర్చు నుంచి భరించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు డబ్బు ఖర్చు విషయంలో పరిమితులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే, స్టార్ క్యాంపెయినర్ ల ఖర్చులు పరిమితులు లేని పార్టీ అకౌంట్ కు వెళ్లాయి.



అయితే,ఎన్నికల సంఘం ప్రకటనపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము కోర్టుని ఆశ్రయిస్తామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కో-ఆర్డినేటర్ నరేంద్ర సలుజా తెలిపారు.



ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్ లో 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. బీజేపీకి జై కొట్టడంతో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి..శివారాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కమల్ నాథ్..దబ్రా ర్యాలీలో మాట్లాడుతూ…బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఇమ్రాతి దేవి అనే మహిళా నేతను ‘ఐటం’ అని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఇలాంటి పదాలు వాడకూడదంటూ ఎన్నికల సంఘం కమల్ నాథ్ ని హెచ్చరించింది. అయితే,ఎన్నికల సంఘం హెచ్చరిస్తున్నప్పటికీ ఆయన పదే పదే వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వచ్చారు.