అందరి కళ్లు ఆయనవైపే, విజయం సాధిస్తారా ?

మెట్రోమ్యాన్... పెట్రో రేట్లు.. ఓట్లు కురిపిస్తాయా... అనే సందేహం కమలనాథుల్లోనూ కనిపిస్తోంది. దీంతో.. మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు.

అందరి కళ్లు ఆయనవైపే, విజయం సాధిస్తారా ?

Metro Man BJP

Kerala elections : ఈసారి ఎలాగైనా కేరళలో పాగా వేయాలని చూస్తోంది కమలదళం. అందుకు తగ్గట్లే ఎత్తులు వేస్తోంది. ఓవైపు మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించింది. అధికారం ఇస్తే… 60 రూపాయలకే లీటర్‌ పెట్రోల్‌ ఇస్తామంటూ హామీలు గుప్పించింది. అయినా కూడా పినరయి విజయన్‌ కోటలు బద్ధలు కొట్టగలమా అని డౌట్.. దీంతో.. త్రిపుర వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. 2016 ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమైన కమలం పార్టీ… ఈసారి ఏకంగా సీఎం పీఠం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌ను తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ.

ఎన్నో ప్రాజెక్టులు పూర్తి : –
ఎన్నో కష్టసాధ్యమైన ప్రాజెక్టులను సమర్థవంతంగా పూర్తి చేసిన శ్రీధరన్‌.. అత్యంత కష్టమైన కేరళనూ తమకు అందిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుంది బీజేపీ. అలాగే.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఫోకస్‌ పెట్టింది. తమకు అధికారం కట్టబెడితే… పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గిస్తామనీ హామీలు గుప్పిస్తోంది. పెట్రోల్‌ డీజిల్‌ జీఎస్‌టీలోకి తీసుకురావడం ద్వారా లీటర్‌ పెట్రోల్‌ ధరను 60కి అందిస్తామని హామీ ఇస్తోంది. ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్‌టీలోకి తీసుకొచ్చేందుకు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించింది. మెట్రోమ్యాన్… పెట్రో రేట్లు.. ఓట్లు కురిపిస్తాయా… అనే సందేహం కమలనాథుల్లోనూ కనిపిస్తోంది. దీంతో.. మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు. 2018లో త్రిపురలో అనుసరించిన వ్యూహాన్ని కేరళలో అమలు చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. పాతికేళ్ల పాటు త్రిపురలో వామపక్షాలు చక్రం తిప్పాయి. చివరకు 2018లో ఆ కంచుకోటను బీజేపీ బద్ధలు కొట్టింది. మాణిక్ సర్కార్ నేత్రుత్వంలోని సీపీఎంని మట్టికరిపించింది. అసంతృప్తులకు ఎరవేస్తూ… బూత్ స్థాయిలో బలం పెంచుకుంది. ప్రజా సమస్యలను ప్రధానంగా తెరపైకి తెచ్చింది. నిరుద్యోగం, అవినీతి, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యునిటీకి చేరువయ్యే ప్రయత్నం చేసింది. చివరకు కమ్యూనిస్టుల కోటపై కాషాయ జెండాను ఎగురవేసింది.

బీజేపీ స్కెచ్చులు: –
ఇప్పుడు కేరళ కోసం కూడా ఇలాంటి స్కెచ్చులే వేస్తున్నారు కమలనాథులు. కేరళలో వామపక్షాలకు కాంగ్రెస్ కూటమి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఆ కూటమిని దాటి… ముందుకెళ్లాలి అంటే… కేరళలో ఎక్కువగా ఉండే కమ్యూనిటీని మచ్చిక చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. హిందుత్వ, అభివృద్ధి.. ఈ రెండు అంశాలే బీజేపీ ప్రధానాస్త్రాలు. అయితే… ఆ పరిధిని దాటి క్రైస్తవ సమాజాన్ని చేరువయ్యే ప్రయత్నం చేసింది. ఇప్పటికిప్పుడే కాకుండా… గత కొన్నాళ్లుగా క్రిస్టియన్ కమ్యునిటీతో సహవాసం పెంచుకుంటూ వస్తోందా పార్టీ. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకంగా 500మంది క్రిస్టియన్ అభ్యర్థులను బీజేపీ బరిలోకి దింపింది. పతనంతిట్ట జిల్లాలోని శబరిమల యుద్ధభూమి పందలం మున్సిపాలిటీని గెల్చుకుంది. దాంతో పాటు… కేరళలోని అనేక ప్రాంతాల్లో బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించింది. దీంతో… క్రిస్టియన్ కమ్యూనిటీ ఔట్ రీచ్‌లో తాము కాస్త సక్సెస్ అయినట్లే అని బీజేపీ భావిస్తోంది.

చర్చి భవనం : –
లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తైన వెంటనే ఈ ఏడాది జనవరి 19న ప్రధాని నరేంద్ర మోదీ.. చర్చి నాయకుల బృందంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మైనారిటీ సంక్షేమ పథకాలతో ముస్లిం సమాజానికి కలుగుతున్న అదనపు ప్రయోజనాలపై చర్చి పెద్దలు ఫిర్యాదుచేశారు. ఇవే కాకుండా.. లవ్ జిహాదీ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. అలాగే.. ఫిబ్రవరిలో జరిగిన మరో ఘటనతో క్రిస్టియన్లకు మరింత దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నించింది. నేషనల్ హైవే కోసం 1050లో నిర్మించిన సెయింట్ జార్జి ఆర్థోడాక్స్ చర్చ్‌ను పడగొట్టాల్సి వచ్చింది. కానీ… ఈ విషయంలో జోక్యం చేసుకున్న ప్రధానీ మోదీ చర్చి భవనాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించారు. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.

2014 ఎన్నికల్లో : –
తాజాగా… మలంకర ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ అలప్పుజ జిల్లాలోని చెంగనూరు బీజేపీ నేత ఆర్ బాల శంకర్‌కు సపోర్ట్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ వాదనను ఆర్థోడాక్స్ చర్చ్ సభ్యులు కొట్టి పారేశారు. అయితే.. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని, బీజేపీని సపోర్ట్ చేసింది. మరోవైపు… డెమోలిషన్‌ మ్యాన్‌గా గుర్తింపు పొందిన కేజే అల్ఫోన్స్.. బీజేపీలో చేరడానికి ముందు.. ఢిల్లీలో ఎన్డీఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఆయనకు… మలంకర ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ సభ్యులు సపోర్ట్ చేస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా.. క్రిస్టియన్ కమ్యునిటీకి దగ్గరైతే… ఎక్కువ లాభపడొచ్చని కమలనాథులు ఆశిస్తున్నారు