కులాంతర వివాహం చేసుకునేవాళ్ల కోసం…కేరళలో సేఫ్ హోమ్స్

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2020 / 12:43 PM IST
కులాంతర వివాహం చేసుకునేవాళ్ల కోసం…కేరళలో సేఫ్ హోమ్స్

కొన్ని కొన్ని సందర్భాల్లో కులాంతర, మతాంతర వివాహలు చేసుకునే వాళ్లకు వాళ్ల కుటుంబాల నుంచి బెదిరింపులు వచ్చిన ఘటనలు మనం ఇప్పటికే చూశాం. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కులాంతర,మతాంతర వివాహాల పట్ల అభ్యంతరాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చోట కులాంతర,మతాంతర వివాహాలు చేసుకున్నవాళ్లపై దాడులకు పాల్పడటం,హత్యలు చేయడం వంటి ఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాయు.

అయితే కులాంతర,మతాంతర వివాహం చేసుకునేవాళ్లకు తాము అండగా ఉంటామంటోంది కేరళ ప్రభుత్వం. కులాలకు,మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న దంపతులకు అండగా నిలిచేందుకు, అలాంటి వారికి భద్రత కల్పించేందుకు భద్రతా గృహాలు(సేఫ్ హోమ్స్) ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు కేరళ ఆరోగ్య, సామాజిక న్యాయ శాఖ మంత్రి కెకె శైలజ తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ భద్రతా గృహాలు నిర్మాణం జరుగుతోందని ఆమె తెలిపారు. ఈ సేఫ్ హోమ్ప్ లో నవ దంపతులు ఒక సంవత్సర కాలంపాటు ఉండేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది.

ఈ దంపతులకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. ఒకవేళ ఈ దంపతులలో ఎవరైనా షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వారుంటే వారికి 75 వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం లభిస్తుందని మంత్రి తెలిపారు. ఈ సేఫ్ హోమ్స్ ముఖ్య ఉద్దేశ్యం కులాంతర,మతాంతర వివాహం చేసుకున్నవాళ్లకు భద్రతపై భరోసా ఇవ్వడమేనని కేరళ అసెంబ్లీలో మంత్రి శైలజ తెలిపారు.

కేరళలోని కొట్టాయం జిల్లాలో 2018లో ఓ 23 ఏళ్ల దళిత క్రిస్టియన్ యువకుడిని అతను పెళ్లి చేసుకున్న అగ్ర కులం యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేసిన సంఘటన కేరళ రాష్ట్రమంతా కలకలం రేపిన విషయం తెలిసిందే.