ప్రణబ్ రాజకీయ ప్రస్థానం సాగిందిలా

  • Published By: venkaiahnaidu ,Published On : August 31, 2020 / 06:51 PM IST
ప్రణబ్ రాజకీయ ప్రస్థానం సాగిందిలా

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఇవాళ(ఆగస్టు-31,2020) మధ్యాహ్నం ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు.. కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులను చేపట్టారు. రాజకీయల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ ‘‘మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్” గా గుర్తింపు పొందారు.

రాజకీయ ప్రస్థానం

ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక సంవత్సరాలు జైల్లో గడిపారు. 1952 నుంచి 1964 వరకూ పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యుడిగా ఉన్నారు.

ప్రణబ్ ముఖర్జీ.. చదువు, ఉద్యోగం కోల్‌కతాలో సాగింది. చదువు ముగిసిన తరువాత అధ్యాపకుడిగా, విలేకరిగా పనిచేసిన తరువాత 1969లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభమైంది. మిడ్నాపూర్ ఉప ఎన్నిక‌ల వేళ‌ వీకే కృష్ణ‌మీన‌న్ త‌ర‌పున ప్ర‌ణ‌బ్ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్నారు.

ప్ర‌ణ‌బ్ ట్యాలెంట్‌ను గుర్తించిన ఇందిర ఆయ‌న్ను పార్టీలోకి ఆహ్వానించింది. 1969లో రాజ్య‌స‌భ‌కు ప్ర‌ణ‌బ్ తొలిసారి ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 1975, 1981, 1993, 1999 ఎన్నిక‌ల్లోనూ ప్ర‌ణ‌బ్ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకూ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు.

ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్ఎస్సీ)ను స్థాపించారు. మూడేళ్ల తరువాత ఈ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

ప్రణబ్ ముఖర్జీ….1993-95 వరకూ కేంద్ర వాణిజ్య మంత్రిగా, 1995-96, 2006-09లలో విదేశీ వ్యవహరాల మంత్రిగా, 2004-06 వరకు రక్షణ మంత్రిగా, 2009-12 వరకూ ఆర్థిక మంత్రిగా పదవులు నిర్వహించారు.

ఆర్ధిక మంత్రిగా

భారత ఆర్థిక వ్యవస్థకు మొదటి సంస్కర్తగా ముఖర్జీ గుర్తింపు పొందారు. 1982-84 మధ్య బాలన్స్ ఆఫ్ పేమెంట్ తరుగుదలను అదుపులో పెట్టి, కేంద్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధానాలను తీసుకురావడంలో ముఖర్జీ ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాకుండా ఐఎంఎఫ్ చివరి విడత రుణ సహాయాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయడం ద్వారా ఆర్థిక మంత్రిగా తన సమర్థతను చాటుకున్నారు.

1991-96 వరకూ ప్రధాని పీవీ నరసింహరావు అధ్యక్షతన ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2008లో పద్మ విభూషణ్ పురస్కరాన్ని గ్రహించారు. 2009 లో ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. 2010-11 బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా ప్రజా రుణాన్ని తగ్గించే లక్ష్యాన్ని ప్రకటించారు. ద్యవ్యలోటును తగ్గిస్తూ, వృద్ధిరేటుని పెంచే వివిధ ఆర్థిక విధానాలను రూపొందించారు.

అంతర్జాతీయ గుర్తింపు
ప్రణబ్ ముఖర్జీ  అంతర్జాతీయ సంస్థల్లో కూడా ముఖ్యమైన స్థానాలను అధిష్టించారు. భారత ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలోనే ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్ (ఐఎంఎఫ్), వరల్డ్ బ్యాంకులలో బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా వ్యవహరించారు.