బరువు తగ్గింది :శనివారం ‘నో స్కూలు బ్యాగ్ డే’

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 04:56 AM IST
బరువు తగ్గింది  :శనివారం ‘నో స్కూలు బ్యాగ్ డే’

వీపుపై బండెడు పుస్తకాలు..చేతిలో లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్..ఇదీ  స్కూల్  విద్యార్థుల పరిస్థితి. పుస్తకాల బ్యాగులు మోసీ మోసీ చిన్న వయస్సులోనే నడుము..వెన్ను నొప్పులతో బాధపడుతున్నారు విద్యార్థులు. దీనిపై దృష్టి పెట్టిన మణిపూర్ ప్రభుత్వం ఈ భారం తగ్గించింది. ఇకనుంచి వారానికి ఒకరోజు స్కూల్ బ్యాగులు మోయాల్సిన పనిలేదని అంటోంది. ప్రతీ శనివారాన్ని  ‘నో స్కూలు బ్యాగ్ డే’ గా అమలు చేయనున్నామని సీఎం ఎన్ బీరేన్ సింగ్ తెలిపారు. ఇది ప్రభుత్వ పాఠశాలలో పాటు ప్రైవేటు స్కూల్స్ కూడా వర్తిస్తుందని తెలిపారు.  

మణిపూర్ లో 1 నుంచి 8వతరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతి శనివారం ‘నో స్కూలు బ్యాగ్ డే’గా అమలు చేస్తామని సీఎం బీరేన్ సింగ్ వెల్లడించారు. ప్రపంచం వేగంగా మారుతుందని..అందుకే స్కూల్ విద్యార్థులకు స్వేచ్ఛనిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. పిల్లలు ఎప్పుడు పుస్తకాలే కాకుండా ఆటపాటలతో ఉల్లాసంగా ఉండాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ శనివారం పాఠశాలకు విద్యార్థులు స్కూలు బ్యాగ్ లేకుండానే వస్తారని బీరేన్ సింగ్ అన్నారు. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.