Modi-Biden : మోడీకి బైడెన్ ఫోన్..సహాయం అందిస్తామని హామీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా ప్రెసిడెంట్ బైడెన్..ఫోన్ చేశారు.

Modi-Biden : మోడీకి బైడెన్ ఫోన్..సహాయం అందిస్తామని హామీ

Modi

Telephone Conversation : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా ప్రెసిడెంట్ బైడెన్..ఫోన్ చేశారు. దేశంలో కరోనా పరిస్థితులను బైడెన్ కు వివరించారు మోడీ. వ్యాక్సిన్ ముడి పదార్థాలను పంపించేందుకు అమెరికా అంగీకారం తెలిపింది. భారత్ కు అన్ని విధాల సహాయం అందిస్తామని బైడెన్ హామీనిచ్చారు.

వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిసరుకుల ఎగుమతిపై అమెరికా నిషేధం విధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గతేడాది కరోనా నుంచి అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు భారత దేశం చేసిన సాయాన్ని సైతం అగ్రరాజ్యం మర్చిపోయిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ దేశ ప్రజలందరూ వైరస్ తో అల్లాడిపోతోంటే ఇండియా ముందుకు వ‌చ్చి అత్యంత కీలకమైన హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని సైతం ఎత్తివేసి సాయం చేసింది. కానీ… అగ్రరాజ్యం మాత్రం… అత్యవసరమైన వాటిపై కొత్తగా నిషేధం విధించింది.

వైరస్ సెకండ్ వేవ్ తో అల్లాడిపోతున్న భారత్ కు వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిసరుకులు ఇవ్వలేమని స్వార్థపూరిత ప్రకటనలు చేసింది అమెరికా. ఎలాంటి సహాయం చేయలేమంటూ నిర్మొహమాటంగా చెప్పింది. భారతదేశంలో వాడుతున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీలో ఉపయోగపడే ముడిసరకుల విషయంలో పీటముడులు వేయవద్దని, నిషేధం తొలగించాలని అగ్రరాజ్యాన్ని భారత్ పలుమార్లు కోరింది.

కొవిషీల్డ్ తయారీ సంస్థ అయిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సైతం స్వయంగా అమెరికా అధ్యక్షుడికి దీనిపై విన్నవించింది. అయినా ఆ దేశం పట్టించుకోలేదు. పైగా… ముందుగా తమ పౌరులకు వ్యాక్సినేషన్ చేయడమే తమ లక్ష్యమని, ఆ తర్వాత సాయం గురించి ఆలోచిస్తామని నిస్సుగ్గుగా ప్రకటించింది. రా మెటీరియల్ ఎక్స్ పోర్ట్ ను బ్యాన్ చేయడం సబబేనంటూ సమర్థించుకుంది.

ముడిసరుకుల సరఫరాలోనే కాదు.. వ్యాక్సిన్ల విషయంలోనూ ఇదే వైఖరి అవలంభించింది అమెరికా. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా టీకాలు లెక్కకుమించి ఉన్నాయి. దాదాపు 4కోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు గోడౌన్లలోఉండిపోయాయి. వాటిని విడుదల చేసి ఆపన్నహస్తం చాటాల్సిన సమయంలోనూ అగ్రరాజ్యం ఆ పనిచేయలేదు. అయితే.. భారత్ కు వైరి దేశాలైన పాకిస్తాన్, చైనా సైతం సాయం చేసేందుకు ముందుకు వచ్చిన తరుణంలో.. అమెరికా వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బైడెన్ సర్కార్ దిగి వ‌చ్చింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత్‌కు ఎటువంటి సహాయం కావాలన్నా వెంటనే చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.

Read More : Covid in AP : కోవిడ్ ఆసుపత్రుల్లో కరెంటు పోవద్దు, మరింత మంది వైద్యుల నియామకం – సీఎం జగన్