క్షీణించిన అమరావతి ఎంపీ ఆరోగ్యం…నాగపూర్ కి తరలింపు

క్షీణించిన అమరావతి ఎంపీ ఆరోగ్యం…నాగపూర్ కి తరలింపు

మహారాష్ట్ర లోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమెను నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు.

కొద్ది రోజుల క్రితం నవనీత్ కౌర్‌తో పాటు ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రానాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వారితో పాటు వారి కుటుంబంలోని మొత్తం 12 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో నవనీత్ కౌర్ పిల్లలు, అత్తమామలు కూడా ఉన్నారు. అయితే తమ కుటుంబం కరోనా బారిన పడినట్లుగా నవనీత్‌ కౌర్‌, రవి రానా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. గత కొద్ది రోజులుగా తమను కలిసి వారు పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

2019లో బీజేపీ తరపున మహారాష్ట్ర లోని అమరావతి లోక్ సభ స్థానానికి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ నవనీత్ కౌర్… స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు .శివనసేన ఎంపీ ఆనందరావును భారీ తేడాతో ఓడించారు.

నవనీత్ కౌర్ భర్త, యువ స్వాభిమాన్ పార్టీ నాయకుడు. రవి రానా బద్నేరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరోనా కష్టకాలంలో తన నియోజకవర్గం ప్రజలు తనవంతుగా సాయం కూడా చేశారు నవనీత్ కౌర్. పేదల్ని ఆదుకున్నారు. అంతేకాదు కరోనాను తప్పించుకోవడానికి ప్రజలకు తగిని సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. నవనీత్‌ కౌర్‌ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు.