భారత విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేసిన చైనా..ముంబై పవర్ కట్ వాళ్ల పనే

భారత విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేసిన చైనా..ముంబై పవర్ కట్ వాళ్ల పనే

Massive Power-cut

Power Facilities భారత్ లోని విద్యుత్ కేంద్రాలను చైనా టార్గెట్ చేసింది. 9నెలలుగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్ఠంభణ క్రమంగా తొలుగుతున్న సమయంలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సరిహద్దుల్లో జగడం కొనసాగుతున్న సమయంలోనే భారత్ లోని విద్యుత్ కేంద్రాలను చైనా టార్గెట్ చేసినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. న్యూయార్క్ టైమ్స్ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది.

గతేడాది అక్టోబర్ లో ముంబైలో చాలాసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన విషయాన్ని చైనా కుట్రకు ఉదాహరణగా కొత్త అధ్యయనం పేర్కొంది. ముంబైలో అప్పుడు విద్యుత్ సరఫరా లేక నగరంలో చాలా సేపు రైళ్లు నిలిచిపోయాయి. పవర్ లేక హాస్పిటల్స్ లో రోగుల సేవలు స్తంభించిపోయాయి. కొన్ని గంటలపాటు స్టాక్ ఎక్స్ చెంజీ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఇందుకు కారణం చైనా హ్యాకర్ల కార్యకలాపాలేనని ఈ స్టడీలో పేర్కొన్నారు. చైనీస్ మాల్ వేర్..భారత దేశ వ్యాప్తంగా పవర్ సప్లయ్ మీద తీవ్ర ప్రభావం చూపుతోందనడానికి ఆధారాలున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది.

చైనాకు చెందిన “RedEcho” అనే ఈ యాక్టివిటీ గ్రూప్ ఇండియాలో ప్రధాన విద్యుత్ ప్లాంట్లలో మాల్ వేర్ ని జొప్పించిందని అనుమానిస్తున్నారు. ఆన్ లైన్ డిజిటల్ థ్రెట్స్ ని విశ్లేషించే అమెరికాకు చెందిన ‘రికార్డెడ్ ఫ్యూచర్’ అనే సంస్థ ఈ మాల్ వేర్ ని కనుగొంది. మాల్ వేర్ లో చాలాభాగం యాక్టివేట్ కాలేదని, ఈ సంస్థ భారత విద్యుత్ సిస్టమ్స్ ని పరిశీలించినప్పుడు ఈ విషయం బయటపడిందని అంటున్నారు. ఫలితంగా హ్యాకర్ల కోడ్ ను ఈ సంస్థ కనుగొనలేకపోయింది. భారత విద్యుత్ సిస్టమ్స్ లోకి చొరబడేందుకు చైనా హ్యాకర్లు అత్యంత అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారని భావిస్తున్నారు. ఇండియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్లను టార్గెట్ చేశారనడానికి ముంబై పవర్ కట్ నిదర్శనంగా కనిపిస్తోందంటున్నారు.

2020 ప్రారంభం నుంచే రికార్డెడ్ ఫ్యూచర్ కి చెందిన ఇన్ సిక్ట్ గ్రూప్..చైనా స్పాన్సర్ చేస్తున్న గ్రూపుల నుంచి భారతీయ విద్యుత్ కేంద్రాల్లోకి చొరబడుతున్న మాల్ వేర్ ను గుర్తించిందట. 12 భారతీయ కేంద్రాలకు అనుబంధంగా ఉన్న 21 సంస్థలను క్రిటికల్ గా క్లాసిఫై చేశారని, వీటిని చైనా టార్గెట్ చేసిందని తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ మాల్ వేర్ ను గుర్తించడం మంచిదేనని, ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చునని నిపుణులు తెలిపారు.