Kashmir Civilian Killings : కశ్మీర్ లో పౌరుల హత్యలపై NIA దర్యాప్తు!

  కశ్మీర్ లో గత కొద్ది రోజులుగా మైనార్టీలైన హిందువులు,సిక్కులతో పాటు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్న విషయం తెలిసిందే. గడిచిన రెండు వారాల్లో శ్రీనగర్ సహా కశ్మీర్ లో

10TV Telugu News

Kashmir Civilian Killings  కశ్మీర్ లో గత కొద్ది రోజులుగా మైనార్టీలైన హిందువులు,సిక్కులతో పాటు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్న విషయం తెలిసిందే. గడిచిన రెండు వారాల్లో శ్రీనగర్ సహా కశ్మీర్ లో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటి వరకూ 11 మంది పౌరులు హత్యకు గురయ్యారు. మృతుల్లో స్థానికేతరులు ఐదుగురు ఉన్నారు.

ఈ నేపథ్యంలో పౌరుల వరుస హత్యలపై NIA(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తును ఎన్​ఐఏకు అప్పగించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు జమ్ముకశ్మీర్​ డీజీపీ లేఖ పంపుతున్నట్లు సమాచారం. హోంశాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఎన్​ఐఏ రంగంలోకి దిగనుంది. జమ్మూకశ్మీర్‌ పోలీసుల నుంచి నాలుగు కేసులను ఎన్‌ఐఏ హస్తగతం చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, ఆర్మీ చీఫ్​ జనరల్​ నరవణె.. వారం రోజులుగా ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా పూంచ్​లో కొనసాగుతున్న ఆపరేషన్​ సైట్లను సందర్శించారు. నియంత్రణ రేఖ వెంబడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారు. చోరబాట్లకు వ్యతిరేకంగా సాగుతున్న కార్యకలాపాలను నరవణెకు అధికారులు వివరించారు.

కాగా, కశ్మీర్‌ లో సామాన్య ప్రజానీకంపై ఉగ్రదాడులతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. పౌరుల హత్యలు, భద్రతా దళాలు-ముష్కరుల ఎన్​కౌంటర్లతో గత కొన్ని రోజులుగా జమ్ముకశ్మీర్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉగ్రదాడుల నేపథ్యంలో కశ్మీర్ వ్యాలీలో పనిచేస్తున్న స్థానికేతరులను పోలీసులు దగ్గరలోని సెక్యూరిటీ క్యాంపులకు తరలించారు. అయితే ప్రజలపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులను వదిలిపెట్టబోమని కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు.

ALSO READ  కశ్మీర్ లోని స్థానికేతరులందరికీ ఏకే-47లు ఇవ్వాలి

ALSO READ  కశ్మీర్ హింసలో పాక్ కుట్ర బట్టబయలు..ఐఎస్ఐ బ్లూప్రింట్ లో సంచలన విషయాలు