నిర్మలా కాదు నిర్బలా…ఆ DNA వాళ్లకే ఉందన్న ఆర్థికమంత్రి

  • Published By: venkaiahnaidu ,Published On : December 2, 2019 / 01:20 PM IST
నిర్మలా కాదు నిర్బలా…ఆ DNA వాళ్లకే ఉందన్న ఆర్థికమంత్రి

కాంగ్రెస్ పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి… నిర్మలా కాదు నిర్బల అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. తాను ఒక చెత్త ఆర్థికమంత్రి అంటూ కొంతకాలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని,తన పదవీకాలం పూర్తయ్యే వరకు కూడా వాళ్లు ఆగలేకపోతున్నారని ఆమె అన్నారు. ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేందుకు అవసరమైన మరిన్ని సలహాలు ఇవ్వాలని తాను వారికి చెప్పానని ఆమె అన్నారు. ఏదైనా వినే ప్రభుత్వం ఉంటే అది మోడీ ప్రభుత్వమేనని ఆమె అన్నారు.

తమది విమర్శలనైనా,సలహాలు అయినా వినే ప్రభుత్వమని అన్నారు. వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ చేసిన విమర్శలపై హోంమంత్రి అమిత్ షా స్పందించారని,తాము వినడానికి లేదా విమర్శలను స్పీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. పార్లమెంట్ లో తనను పలు పేర్లతో పిలిచారని ఆమె అన్నారు. ప్రశ్నలు అడిగి,సమాధానం చెప్పేలోగా పారిపోయే డీఎన్ఏ ఎవరికైనా ఉందంటే అది ఇతర పార్టీలకని, తమ పార్టీకి కాదని ఆమె అన్నారు. 

అంతకుముందు ఇవాళ మధ్యాహ్నాం లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ…దేశ ఆర్థికవ్యవస్థపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి దృష్టి కొరవడింది. ఆర్థికమంత్రి సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు ఆర్థికమంత్రిని నిర్మలా సీతారాన్ కు బదులుగా నిర్బలా(బలహీన) సీతారామన్ గా పిలవడం సముచిమో కాదో అనే ఆశ్చర్యం వ్యక్తమవుతుంటదని అన్నారు.