Nirma Washing Powder : ఉద్యోగం వదిలి వ్యాపారంలోకి.. ఇప్పుడు దేశంలో 39వ ధనవంతుడు

వ్యాపారం ప్రారంభించే వారు ఎవరైనా కర్సాన్ భాయ్ పటేల్ గురించి తెలుసుకుంటారు. ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి.. ఇప్పుడు దేశంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరుగా నిలిచారు. ఎందరో యువ వ్యాపారులకు ఈయన ఆదర్శంగా నిలుస్తున్నారు.

Nirma Washing Powder : ఉద్యోగం వదిలి వ్యాపారంలోకి.. ఇప్పుడు దేశంలో 39వ ధనవంతుడు

Nirma Washing Powder

Nirma Washing Powder : వ్యాపారం చేయాలనే ఆలోచన చాలామందిలో ఉంటుంది.. కానీ దానికి తగిన కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లే సామర్ధ్యం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆలా కార్యాచరణ చేసి ధైర్యంతో ముందుకు వెళ్లిన వారిలో గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా స్థిరపడిన వారు ఎందరో ఉన్నారు. ఇక వ్యాపారం చేయడంలో గుజరాతీయులను మించిన వారు దేశంలో లేరనడంలో సందేహం లేదు. వ్యాపార లక్షణం గుజరాతీయుల రక్తంలోనే ఉందని చాలామంది అంటుంటారు.

అది వాస్తవం కూడా.. దేశంలో ఉన్న వ్యాపారవేత్తల్లో 30 శాతం మంది బడా వ్యాపారవేత్తలు గుజరాత్ లోనే ఉన్నారు. వారిలో ఒకరు కర్సాన్ భాయ్ పటేల్.. నిర్మా సర్ఫ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 1990 దశకంలో పుట్టిన వారికీ నిర్మా సర్ఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెల్లటి డ్రెస్ వేసుకున్న ఓ బాలిక ఎగురుకుంటు వచ్చి ఓ కవర్ మీద బొమ్మల వాలిపోతుంది. ఆ తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా.. డిటర్జంట్ బిల్లా నిర్మా.. పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది రంగుల బట్టలే తళతళగా మెరిసాయి అనే సాంగ్ వినే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది ఈ సంస్థ అధినేత గురించే..

కర్సాన్‌ భాయ్ పటేల్..

ఈ పేరు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.. వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారిలో చాలామంది ఈయన గురించి తెలుసుకుంటారు. సైకిల్ పై సర్ఫ్ అమ్మి ఈ రోజు విమానాల్లో తిరిగే స్థాయికి వెళ్లారు. అందుకే యువ వ్యాపారులు ఈయన గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ‘

ఇక కర్సాన్‌ భాయ్ పటేల్ గురించి తెలుసుకోవాలి అంటే 1945లో గుజరాత్‌లోని రూపూర్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. 21 సంవత్సరాల వయస్సులో కెమిస్ట్రీలో పట్టభద్రుడయ్యాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం చేయాలనీ నిర్ణయించుకున్నాడు.. లాల్‌ భాయ్ గ్రూపుకు చెందిన న్యూ కాటన్ మిల్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగంలో చేరాడు.

ఆ తర్వాత కొద్దీ రోజులకు గుజరాత్ ప్రభుత్వ భూగర్భ శాస్త్రం, మైనింగ్ విభాగంలో ఉద్యోగం పొందారు. ఏడేళ్లపాటు ఉద్యోగం చేశాడు. ఇదే సమయంలో తన మనసు వ్యాపారం వైపు మళ్లింది. ఈ సమయంలోనే 1969లో సోడా యాష్, డిటర్జెంట్ ఉత్పత్తులను తయారు చేయడానికి కొన్ని పదార్ధాలను కలిపాడు.. వాటి ద్వారా ఓ ఫార్ములా పొందాడు. తన ప్రయోగం సక్సెస్ కావడంతో ఇంటి ఆవరణలో ఉన్న 100 చదరపు అడుగుల స్థలంలో సర్ఫ్, డిటర్జంట్ తయారు చేయడం మొదలు పెట్టాడు.

ఓ వ్యక్తి సాయంతో సైకిల్ పై తిరుగుతూ వాటిని అమ్మడం ప్రారంభించాడు. మార్కెట్లో లభించే బ్రాండ్ సర్ఫ్ లకంటే నాలుగు రేట్లు తక్కువ ధరకు తన సర్ఫ్ అమ్మేవాడు. దీంతో ప్రజలు కర్సాన్‌ భాయ్ సర్ఫ్ కొనేందుకు ఎగబడేవారు. ఆలా వ్యాపారం సాఫీగా సాగుతున్న సమయంలోనే కారు ఢీకొనడంతో తన కూతురు మృతి చెందింది. ఈ సమయంలో కొద్దిగా కుండిపోయాడు కర్సాన్‌ భాయ్. తన కూతురు నిరుపమ పేరుతో “నిర్మా” అనే బ్రాండ్ ను ఏర్పాటు చేసి మార్కెట్ లోకి విడుదల చేశాడు.

ఓ మంచి యాడ్ క్రియేట్ చేసి టీవీలో ప్రచారం చేయించాడు. దీంతో నిర్మా హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎక్కడ చూసిన నిర్మ యాడ్స్, హోర్డింగ్స్ కనిపించేవి, ధర కూడా తక్కువగా ఉండటంతో ప్రజలు నిర్మా సర్ఫ్, వాడేందుకు మొగ్గు చూపారు. దీంతో నిర్మా కంపెనీ మార్కెట్ లో నిలదొక్కుకొని టాప్ డిటర్జెంట్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.

నిర్మా విశ్వవిద్యాలయం

ఓ వైపు డిటర్జంట్ వ్యాపారం కొనసాగిస్తూనే విద్యా సంస్థలపై దృష్టిపెట్టారు కర్సాన్‌ భాయ్ పటేల్. 2003లో గుజరాత్ అసెంబ్లీ ఆమోదించిన ప్రత్యేక చట్టం ప్రకారం నిర్మా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. కర్సాన్‌ భాయ్ పటేల్ కి యూనివర్సిటీ స్థాపించాలని ఆలోచన 1995లోనే వచ్చింది. ఆ కల 2003లో నెరవేరింది.

ఫోర్బ్స్ జాబితా

కర్సాన్‌ భాయ్ పటేల్ ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో 775 వ స్థానంలో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 39 వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ నికర విలువ 4.1 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ తెలిపింది. కాగా 75 ఏళ్ల కర్సన్‌ భాయ్ పటేల్ తన విజయవంతమైన వ్యాపారాలను తన ఇద్దరు కుమారులు రాకేశ్ పటేల్, హిరెన్‌భాయ్ పటేల్ చేతిలో పెట్టారు.

2010లో ఆయనకు భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. నేటికీ, నిర్మా ప్రపంచంలోనే సోడా యాష్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది.

ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి.. దైర్యంగా వ్యాపారం ప్రారంభించి.. అనేక ఒడిదుడుకులను ఎదురుకొని ఓ గొప్ప వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు. ప్రస్తుతం అనేక మంది యువ పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు కర్సాన్‌ భాయ్ పటేల్.