బంగారమే : నాసిక్‌లో లక్ష విలువైన ఉల్లిగడ్డల దొంగతనం

  • Published By: madhu ,Published On : September 25, 2019 / 06:15 AM IST
బంగారమే : నాసిక్‌లో లక్ష విలువైన ఉల్లిగడ్డల దొంగతనం

ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దిగిరావడం లేదు. బంగారంలాగా మారిపోయిన ఉల్లిగడ్డలను చోరీ చేసేస్తున్నారు. బీహార్‌లోని పాట్నాలో ఉల్లిగడ్డల సంచులను ఎత్తుకెళ్లిన సంగతి మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. లక్ష రూపాయల విలువైన ఉల్లిగడ్డల సంచులను దొంగలు ఎత్తుకెళ్లారని ఓ వ్యక్తి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఈ ఘటన నాసిక్ జిల్లాలో చోటు చేసుకుంది. 

నాసిక్ జిల్లాలో ఉన్న మార్కెట్ కమిటీలో ఉల్లిగడ్డలను నిల్వలు చేస్తుంటారు. క్వింటాల్‌కు రూ. 3 వేల 500 నుంచి రూ. 5 వేల ధర పలుకుతోంది. కల్వాన్ తాలూకాలోని స్టోర్ హౌస్‌లో 117 ప్లాస్టిక్ డబ్బాల్లో 25 టన్నుల ఉల్లిగడ్డలను ఉంచినట్లు రాహుల్ బాజీరావు వ్యాపారి వెల్లడించాడు. అయితే..సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం స్టోర్‌లో ఉల్లిగడ్డలు కనిపించలేదన్నారు. ఇతడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. 

ఉల్లిపాయ పంటల్లో యూరియాను కలపడం వల్ల..120 టన్నుల ఉల్లిపాయలు కుళ్లిపోయాయని భౌర్ గ్రామ రైతు విష్ణు అహేర్‌ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రధాన రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనితో ప్రభుత్వాలు పలు చర్యలకు తీసుకుంటున్నాయి. తక్కువ ధరకే ఉల్లిగడ్డలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.