గీత దాటితే కుదరదు.. ప్రభుత్వ నియంత్రణలోకి OTT, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్‌!

  • Edited By: sreehari , November 11, 2020 / 07:43 PM IST
గీత దాటితే కుదరదు.. ప్రభుత్వ నియంత్రణలోకి OTT, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్‌!

Online News Media – OTT platforms : డిజిటల్ న్యూస్ మీడియాకు ఇప్పటివరకూ ఎలాంటి అడ్డు అదుపు లేదు.. ఎవరైనా ఆన్‌లైన్ డిజిటల్ మీడియా ద్వారా కంటెంట్ అందించవచ్చు.

న్యూస్ పోర్టల్స్ మాత్రమే కాదు.. యూట్యూబ్ వంటి అనేక డిజిటల్ వీడియో కంటెంటర్లు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా సింపుల్ గా కంటెంట్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది.

ఇకపై అలా కుదరదు.. ఓటీటీ వంటి స్ట్రీమింగ్ కంటెంట్ ప్రొవైడర్లు కూడా అనుమతి తీసుకోవాల్సిందే..డిజిటల్ న్యూస్ మీడియాపై ప్రత్యేక నియంత్రణ చట్టం రాబోతోంది. దేశంలో ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్, సోషల్ మీడియా సైట్లు, ఓటీటీ ప్లాట్ ఫాంలన్నీ ఇకపై ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లనున్నాయి.

న్యూస్ పోర్టల్, సోషల్ సైట్లన్నింటిని ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకురానుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ లను ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యాస్టింగ్ మినిస్టరీ తమ నియంత్రణలోకి తీసుకురాబోతోంది.

ఇదేగాని అమల్లోకి వస్తే.. ఆన్ లైన్ న్యూస్ మీడియా సహా ఇతర ఓటీటీ ప్లాట్ ఫాంలు స్వయం ప్రతిపత్తిని కోల్పోయే అవకాశం ఉంది.

దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసిన ఈ నోటిఫికేషన్ సోమవారమే జారీ అయింది.

న్యూస్ పోర్టల్స్ మాత్రమే కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై కూడా ప్రభుత్వ నిబంధనలు వర్తించనున్నాయి.ఆన్ లైన్ ప్లాట్ ఫాంపై అందించే సినిమాలు, ఆడియో విజువల్స్, న్యూస్, కరెంట్ అఫైర్స్ కంటెంట్ మొత్తం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ డొమైన్ నియంత్రణలోకి రానున్నాయి.

ఇప్పటివరకూ డిజిటల్ కంటెంట్ కోసం ఎలాంటి  నియంత్రణ విభాగం లేదా చట్టం అందుబాటులో లేదు. ఈ కొత్త నియంత్రణ విభాగం మొదటిసారి అందుబాటులోకి రాబోతోంది.

వాస్తవానికి ప్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంటుంది. ఇక న్యూస్ ఛానెళ్లను న్యూస్ బ్రాడ్ క్యాస్టర్స్ ఆఫ్ అసోసియేషన్ (NBA) మానిటర్ చేస్తుంటుంది.

అడ్వర్ టైజింగ్‌పై అడ్వర్ టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఫిల్మ్ మేకింగ్ వంటి అంశాలపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేసన్ (CBFC) నియంత్రణలో ఉంటుంది.ఓటీటీ ప్లాట్ ఫాంలను నియంత్రించే స్వయం ప్రతిపత్తి విభాగానికి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై స్పందించాల్సిందిగా కేంద్రాన్ని గతనెలలోనే కోరింది. దీనిపై కేంద్రానికి సుప్రీం నోటీసులు కూడా జారీ చేసింది.

ఇంటర్నెట్ ద్వారా యాక్సస్ చేసుకునే ఓటీటీ ప్లాట్ ఫాంల్లో హాట్ స్టార్, నెట్ ఫ్లెక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ సర్వీసులతో పాటు న్యూస్ పోర్టల్స్ పై కూడా నియంత్రణ విభాగం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.సాధారణంగా ఏదైనా మూవీని రిలీజ్ చేయాలంటే సెన్సార్ బోర్డు నుంచి తప్పనిసరిగా క్లియరెన్స్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది.

కానీ, ఓటీటీ, స్ట్రీమింగ్ వంటి వేర్వేరు డిజిటల్ మీడియా ప్లాట్ ఫాంలో అయితే డిజిటల్ కంటెంట్ రిలీజ్ చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు.

ఇటీవలే సుప్రీంకోర్టుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.. డిజిటల్ మీడియాపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని విన్నవించింది.

డిజిటల్ మీడియాలో అభ్యంతర కంటెంట్ నియంత్రణలో భాగంగా గైడ్ లెన్స్ కు ముందుగానే సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించాల్సిందిగా కోర్టు సూచించింది.