PIB Fact Check : మళ్లీ లాక్ డౌన్ ?

  • Published By: madhu ,Published On : November 14, 2020 / 09:59 AM IST
PIB Fact Check : మళ్లీ లాక్ డౌన్ ?

PIB Fact Check : మళ్లీ లాక్‌డౌన్‌ అంటూ వచ్చిన వార్తలన్నీ ఫేక్‌ అని తేలిపోయాయి. కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో.. మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారమే అని తెలిపోయింది. దేశంలో మరోసారి లాక్‌డౌన్ విధించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది.



కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఓ ప్రముఖ మీడియా సంస్థ పేరుతో సర్క్యులేట్ అవుతున్న ట్వీట్‌‌ను పోస్టు చేసిన పీఐబీ.. అది మార్ఫింగ్ అని తేల్చింది. లాక్‌డౌన్‌ కాలం నుంచీ.. కరోనా కంటే ఎక్కువగా ఫేక్‌ న్యూస్‌ స్ప్రెడ్‌ అవుతోంది. నిజానిజాలు తెలుసుకోకుండా చాలామంది ఇలాంటి ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో జనం గందరగోళానికి గురవుతున్నారు.



కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మరోసారి విజృంభిస్తుండటంతో.. కేసులను కంట్రోల్‌ చేసేందుకు లాక్‌డౌన్‌ తప్ప వేరే ఆప్షన్‌ లేదనే అంశం ప్రజల్లో బాగా పాతుకుపోయింది. అయితే దీన్నే ఆసరాగా చేసుకున్న కొందరు.. మరోసారి లాక్‌డౌన్‌ అంటూ ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారు. యూరోప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ లాక్‌డౌన్‌లు విధిస్తుండటంతో ఇక్కడ కూడా అమలుచేస్తారేమోనని భావిస్తున్నారు. కానీ భారత్‌లో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ స్పష్టం చేసింది.