ఆన్ లైన్ క్లాసులతో ప్రమాదం

  • Published By: venkaiahnaidu ,Published On : June 23, 2020 / 10:38 AM IST
ఆన్ లైన్ క్లాసులతో ప్రమాదం

జవహర్ లాల్  నెహ్రు యూనివర్సిటీ(JNU)  నిర్వహించే ఆన్‌లైన్‌ క్లాసులకు  సగటున 40 శాతం మంది విద్యార్తులు హాజరు కావడంలేదని ఓ సర్వేలో తేలింది. ఆన్‌లైన్‌ విద్యపై ఇద్దరు జెఎన్‌యు ప్రొఫెసర్లు, 131 మంది ఇతర ఉపాధ్యాయులు సర్వే నిర్వహించగా …ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకపోవడం, సంబంధిత కంప్యూటర్లు లేదా గాడ్జెట్స్ కొరత కారణంగా విద్యార్థులు క్లాసులకు హాజరు కాలేకపోతున్నారని తేలింది. 

అయితే యూనివర్సిటీ అధికారులు మాత్రం ఈ సర్వే ఫలితాలను కొట్టిపారేశారు. ఆన్‌లైన్‌ పద్ధతిలోనే తరగతులను, పరీక్షలను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి కారణంగా తరగతులు ఆగిపోవడంతో 8,800 మంది విద్యార్థులు ఇంటికి వెళ్లిపోగా, కొంత మంది ఇప్పటికీ క్యాంపస్‌ హాస్టళ్లలోనే ఉన్నారు.

కాగా ఆన్‌లైన్‌ విద్యావ్యవస్థలోని లోపాలను ఈ సర్వే బహిర్గతం చేసిందని జెఎన్‌యు ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. దీనిని ప్రోత్సహించకుండా చర్యలు తీసుకోవాలని యుజిసిని హెచ్చరించారు. ఆన్‌లైన్‌ విద్య ఉన్నత, పేద విద్యార్థుల మధ్య అసమానతలను తీవ్రతం చేస్తుందని, అంతే కాకుండా విద్యా ప్రమాణాలు, నాణ్యత దెబ్బతింటుందని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా ప్రొఫెసర్లు ఆయేషా కిడ్వాయి, అతుల్‌ సూద్‌ చేసిన ‘డిజిటల్‌(ఇన్‌) జస్టిస్‌’ సర్వేలో గత మూడు నెలల్లో 40 శాతం పైగా విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకావడం లేదని తేలింది. ఈ 40 శాతం మంది విద్యార్థుల్లో నెలకు రూ.12,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లు యూనివర్సిటీ  రికార్డుల ద్వారా తెలుస్తోంది. బిఎ విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యను పొందడం చాలా కష్టమని, వీరిలో 60 శాతం మంది పాల్గనడం లేదని సర్వేలో తేలింది. 

దూసుకుపోతున్న ఆన్‌లైన్‌ పరీక్షలపై సగం మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, ఒక సంవత్సరం కోల్పోతామేమోనని భయంతో ఉన్నారు.  అంతేకాకుండా కొత్త బోధనా విధానం కోసం గాడ్జెట్లు, శిక్షణతో తమకు మద్దతివ్వాలని విశ్వవిద్యాలయానికి ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్‌ క్లాసులు ఎలా నిర్వహించాలో ఉపాధ్యాయులకు ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహించాలని జెఎన్‌యు స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ సిస్టమ్‌ సైస్సెస్‌ ప్రొఫెసర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.