కాశీ ఆలయ విస్తరణకు మోడీ శంకుస్థాపన

  • Published By: venkaiahnaidu ,Published On : March 8, 2019 / 07:49 AM IST
కాశీ ఆలయ విస్తరణకు మోడీ శంకుస్థాపన

శుక్రవారం(మార్చి-8,2019)జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారణాశిలోని దీన్ దయాళ్ హస్తకళా శంకుల్ దగ్గర ఏర్పాటుచేసిన జాతీయ మహిళా జీవన విధానం-2019 కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని మహిళలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. సరికొత్త భారత్ ను నిర్మించడంలో మహిళలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని మోడీ ప్రశంసించారు. సరికొత్త భారత్ లో కొత్త సాంప్రదాయాన్ని సృష్టించడంలో మహిళల చురుకైన పాత్ర, ఆశీస్సులు చాలా ముఖ్యమని మోడీ అన్నారు.

ఇటీవల ఆర్మీలోని అన్ని విభాగాల్లోకి మహిళలను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. మిషన్స్ ను మన జవాన్లు పూర్తి చేసినప్పుడు..తమకు కూడా అవకాశం ఇస్తే తాము కూడా తమ సత్తా చూపించేవాళ్లమని మన ఆడబిడ్డలు కూడా  ఫీల్ అవుతున్నట్లు తెలిపారు. ఈ రోజు మనదేశంలో మహిళలు యుద్ధవిమానాల్లో విహరిస్తున్నారని, ప్రపంచాన్ని చుట్టివస్తున్నారని అన్నారు. 

వారణాశి పర్యటన సందర్భంగా కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు ప్రధాని మోడీ.మోడీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ ఆలయ విస్తరణ,సుందరీకరణ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. ఆలయ ఆవరణలో విశ్వనాథ్ థామ్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.చాలా ఏళ్లుగా ఈ స్థలం కోసం పనిచేయాలని తాను కన్న కలలు నిజమయ్యాయన్నారు.

తాను రాజకీయాల్లోకి రాకముందు అనేకసార్లు కాశీ విశ్వనాథ ఆలయానికి వచ్చానని, ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి జరగాలని తాను భావించేవాడినని తెలిపారు. తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి నియోజకవర్గంలో సుందరీకరణ ప్రాజెక్టు ప్రారంభం ఆలస్యమవడానికి గత సమాజ్ వాదీ ప్రభుత్వమే కారణమన్నారు. తాను ప్రధాని భాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ల వరకు యూపీలో సహకరించని ప్రభుత్వమే ఉండేదని ఎస్పీపై చురకలంటించారు. మోగి ఆదిత్యనాథ్ ని యూపీ ప్రజలు సీఎంని చేసిన తర్వాతనే ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మోడీ అన్నారు.