పన్ను విధానంలో భారీ సంస్కరణలు…ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ ను ప్రారంభించిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : August 13, 2020 / 03:47 PM IST
పన్ను విధానంలో భారీ సంస్కరణలు…ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ ను ప్రారంభించిన మోడీ

కరోనా సంక్షోభం కారణంగా అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థను పునర్​నిర్మించేందుకు పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నిజాయితీ ప‌న్నుదారుల‌కు మ‌రింత సులువైన విధానాన్ని తీసుకురానున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు.

గురువారం(ఆగస్టు-13,2020)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రాన్స్​పరెంట్​ ట్యాక్సేషన్​ హానరింగ్​ ద హానెస్ట్ ప్లాట్​ఫాం(పార‌ద‌ర్శ‌క ప‌న్నువిధానం వేదిక‌) ను ప్ర‌ధాని మోడీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ప‌న్నువిధానంలో భారీ సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. పార‌దర్శ‌క ప‌న్నువిధానంలో ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ అతిపెద్ద సంస్క‌ర‌ణ అన్నారు. ఫేస్‌లెస్ అపీల్‌, ప‌న్నుదారుల ప‌ట్టిక కూడా సంస్క‌ర‌ణ‌లో భాగ‌మే అన్నారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్‌, ట్యాక్స్ పేయ‌ర్ చార్ట‌ర్‌లు నేటి నుంచే అమ‌లులోకి వ‌స్తాయ‌న్నారు.

ఫేస్‌లెస్ అపీల్ సేవ‌లు మాత్రం సెప్టెంబ‌ర్ 25 నుంచి అందుబాటులోకి రానున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. ప్ర‌తి నియ‌మాన్ని క‌చ్చితంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఏదో ఒక వ‌త్తిడిలో సంస్క‌ర‌ణ‌ల పేరుతో కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని, అలాంటి వాటితో ల‌క్ష్యాల‌ను చేరుకోలేమ‌న్నారు. అలాటి ఆలోచ‌న‌, వ్య‌వ‌హారం అన్నీ మారిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ప‌న్నువిధానాన్ని సాఫీగా త‌యారు చేయ‌డం త‌మ ఉద్దేశ‌మ‌న్నారు. దేశాభివృద్ధి ప్ర‌యాణంలో ప‌న్నుదారుడి చార్ట‌ర్ కూడా పెద్ద ముంద‌డుగే అని తెలిపారు.

నిజాయితీ ప‌న్నుదారుడు ఎటువంటి వేద‌న‌కు గురికాకుండా చూస్తామ‌న్నారు. ఆదాయ‌ప‌న్ను, కార్పొరేట్ ప‌న్నుల‌ను త‌గ్గించిన‌ట్లు తెలిపారు. స‌క్ర‌మంగా ప‌న్నులు చెల్లిస్తున్న‌వారిని మ‌రింత్ ప్రోత్స‌హిస్తామ‌న్నారు. ప‌న్నువిధానం అతుకులు లేకుండా, నొప్పి లేకుండా, ప‌న్నుదారుడు నేరుగా హాజ‌రు కాకుండా ఉండే విధంగా త‌యారు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. కాగా, పన్ను సంస్కరణల్లో భాగంగా గతేడాది కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది కేంద్రం. నూతన తయారీ యూనిట్లకు ఈ రేటును 15 శాతానికి కుదించింది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌‌ను కూడా తొలగించిన విషయం తెలిసిందే.