మోడీ తమ్ముడి కూతురికి టికెట్ ఇవ్వని బీజేపీ

మోడీ తమ్ముడి కూతురికి టికెట్ ఇవ్వని బీజేపీ

Modi’s niece అహ్మదాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడి కుమార్తెకు భంగపాటు ఎదురైంది. త్వరలో జరగనున్న అహ్మదాబ్ మున్సిపల్ కార్పొరేషన్(AMC) ఎన్నికల కోసం గరువారం సాయంత్రం బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ కుమార్తె సోనాల్ మోడీ పేరు కనిపించలేదు. బోడక్ దేవ్ వార్డు నుంచి సోనాల్ మోడీ పోటీ చేసేందుకు ఆమె దరఖాస్తు చేసుకోగా..ఆ వార్డు అభ్యర్థిగా మాత్రమే మరే వార్డు అభ్యర్థిగా కూడా ఆమెను బీజేపీ రాష్ట్రశాఖ ప్రకటించలేదు.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 60ఏళ్ల వయస్సు పైబడినోళ్లకు మరియు రాజకీయ నాయకుల బంధువులకు టికెట్లు ఇచ్చేది లేదని మూడు రోజుల క్రితం గుజరాత్‌ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త రూల్స్ నేపథ్యంలో సోనాల్ మోడీకి టిక్కెట్ ఇవ్వడంలేదని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ పేర్కొంది. బీజేపీలో సీనియర్‌ నాయకుడైనా, సాధారణ కార్యకర్త అయినా అందరూ ఒకటే అని, పార్టీ నియమాలు అందరికీ వర్తిస్తాయని, అందువల్లనే సోనాల్‌కు టికెట్‌ నిరాకరించినట్లు గుజరాత్‌ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ చెప్పారు. తాను మోడీ సోదరుడి కుమార్తెగా టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదని, ఓ సామాన్య కార్యకర్తగా టికెట్ ఆశించానని సోనాల్‌ పేర్కొన్నారు.

ఇక, అహ్మదాబాద్‌ తోపాటు సూరత్‌, రాజ్‌కోట్‌, వడోదర, జాంనగర్‌, భావ్‌నగర్‌ మున్సిపల్‌ కొర్పొరేషన్లకు ఈ నెల 21 న ఓటింగ్‌ జరుగనున్నది. 23 న కౌంటింగ్‌ చేపట్టనున్నారు. అలాగే, 31 జిల్లా పంచాయతీలతోపాటు 231 తహశీల్‌ పంచాయతీలు, 81 మున్సిపాల్టీలకు ఫిబ్రవరి 28 న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 2న ఫలితాలు వెలువడుతాయి.