దేశ వ్యాప్త లాక్‌డౌన్‌పై మోడీ తుది నిర్ణయం ఆదివారమే

దేశ వ్యాప్త లాక్‌డౌన్‌పై మోడీ తుది నిర్ణయం ఆదివారమే

ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. ఎత్తేస్తారా అనే దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్‌డౌన్‌పై  క్లారిటీ రావాలంటే ఆదివారం సాయంత్రం వరకూ ఆగాల్సిందే. రెండోసారి ముఖ్యమంత్రులు అందరితో శనివారం వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడి.. ఆదివారం నిర్ణయం ప్రకటిస్తారు. ఒకవేళ లాక్ డౌన్ పొడిగిస్తే యావత్ భారత్ దేశమంతా కాకుండా పాక్షికంగానే నిర్వహించాలని అనుకుంటున్నట్లు సమాచారం. 

అంతర్రాష్ట్రీయంగా వైరస్ పై పోరాటం కొనసాగుతుందని.. అన్ని సేవలను పునరుద్దరించకుండా అత్యవసరమైనవే పని చేసేట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఒడిశా గురువారమే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వరకూ పొడిగిస్తున్నామని ప్రకటించేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌ పొడిగించాలనే సూచనలు తెలిపినా.. ఏప్రిల్ 30వరకూ కొనసాగించడంపై తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. 

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు సూచనలు కూడా ప్రస్తావించిన కేసీఆర్.. ఆర్థికంగా నిలదొక్కుకోగలం కానీ, ప్రాణాలు పోతే తెచ్చుకోలేమంటూ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ ఒక్కటే మన దగ్గర ఉన్న ఆయుధం అంతకుమించి ఏం చేయలేం అని అన్నారు. అమెరికా, స్పెయిన్, ఇటలీల్లా మనం కూడా పొడిగించడమే మంచిదని సూచనలిచ్చారు. 

మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తేయాలనే ఆలోచనలో ఉంది. ఒకవేళ కొనసాగిస్తే అత్యవసర సేవల్లో ఇంకొన్ని చేర్చాలనే ప్లాన్ చేస్తుంది. ఏప్రిల్ 15న ఒకేసారి లాక్‌డౌన్‌ ఎత్తేయకుండా దశలవారీగా తొలగించాలని సీఎం ఉద్ధవ్ ఠాకరే ట్వీట్ ద్వారా వెల్లడించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి పొడిగించాలనే మాటే వినిపిస్తుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అదే సూచన ఇచ్చారు. ఇక రెండో సమావేశం తర్వాత మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆదివారం తెలుస్తుంది.