4 వేల రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్‌ వైఫై సేవలు

4 వేల రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్‌ వైఫై సేవలు

Prepaid WiFi services launched at 4,000 railway stations : భారత రైల్వేకు చెందిన బ్రాండ్‌బ్యాండ్, వీపీఎన్‌ సర్వీసెస్‌ కంపెనీ రైల్‌టెల్‌ దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్‌ వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పటికే 5,950కి పైగా రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) ఆధారిత ధృవీకరణతో ఎవరైనా సరే ఇంటర్నెట్‌ సేవలను పొందవచ్చు.

తాజాగా విడుదల చేసిన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ప్రకారం ప్రయాణికులు రోజుకు 30 నిమిషాల ఉచిత వైఫైను 1 ఎంబీపీఎస్‌ వేగంతో ఉపయోగించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ వేగవంతమైన లేదా 34 ఎంబీపీఎస్‌ వేగం వరకు ఇంటర్నెట్‌ కోసం వినియోగదారులు నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 5 జీబీ డేటా చార్జీ రూ.10, 10 జీబీకి రూ.15 చార్జీ, అలాగే ఐదు రోజుల వ్యాలిడిటీతో 10 జీబీ చార్జీ రూ.20, 20 జీబీ చార్జీ రూ.30గా ఉన్నాయి.

10 రోజుల వ్యాలిడిటీతో 20 జీబీ చార్జీ రూ.40, 30 జీబీకి రూ.50, అదేవిధంగా 30 రోజుల వ్యాలిడిటీ ఉండే 60 జీబీకి రూ.70 చార్జీలున్నాయి. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణమైన ప్లాన్స్‌ను ఎంచుకునేలా రూపొందించామని రైల్‌టెల్‌ సీఎండీ పునీత్‌ చావ్లా తెలిపారు.