ప్రియాంక గాంధీ ఫోన్ కూడా హ్యాక్ చేశారు..బీజేపీ అంటే భారతీయ జాసూస్ పార్టీ

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 12:19 PM IST
ప్రియాంక గాంధీ ఫోన్ కూడా హ్యాక్ చేశారు..బీజేపీ అంటే భారతీయ జాసూస్ పార్టీ

వాట్సాప్‌పై స్పైవేర్ ఎటాక్ పై రాజకీయ వివాదం తీవ్రమైంది. ప్రియాంక గాంధీ వాద్రాతో సహా ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లను ప్రభుత్వం హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. నిన్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాంటి వాదన చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ ఫోన్ ని కూడా ప్రభుత్వం హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ఇవాళ ఆరోపించింది. ఫోన్లు హ్యాక్ చేయబడిన వారందరికీ వాట్సాప్ మేసేజ్ లు పంపినప్పుడు.. ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా అలాంటి మెసేజ్ వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా తెలిపారు. దేశంలోని అనేకమంది రాజకీయ నేతల, న్యాయవాదుల, ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోస్తోంది. 

ఇజ్రాయిల్‌కు చెందిన నిఘా సంస్థ ఎన్‌ఎస్‌వో పెగాసస్ అనే స్పైవేర్ టూల్ సాయంతో 20 దేశాల్లోని 1,400 మంది వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని వారి అకౌంట్లను హ్యాక్ చేసినట్టు వాట్సాప్ కంపెనీ గురువారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందులో భారతీయ వాట్సాప్ యూజర్లు కూడా ఉన్నట్టు మెసేజింగ్ సంస్థ వెల్లడించింది. స్పైవేర్ టూల్ ద్వారా యూజర్ల మొబైల్ ఫోన్లకు మిస్స్ డ్ కాల్స్ ఇచ్చి బాధితులను టార్గెట్ చేసినట్టు వాట్సాప్ ఆరోపించింది. ఇండియాలో స్పైవేర్ తో ప్రభావితమైన బాధిత యూజర్లను ఒక్కొక్కరిని వాట్సాప్ సంప్రదించి వారిని అప్రమత్తం చేసింది. అందులో ఎకడామిక్స్, లాయర్లు, సామాజికవేత్తలు, జర్నలిస్టులు ఉన్నట్టు వాట్సాప్ తెలిపింది. భారత్ లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏప్రిల్‌లో రెండు వారాల పాటు గూఢచర్యానికి పాల్పడ్డారని వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ తెలిపిన విషయం తెలిసిందే.

ఫేస్ బుక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర రాజకీయదుమారాన్ని రేపుతున్నాయి. దేశంలోని అనేకమంది రాజకీయ నేతల, న్యాయవాదుల, ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోస్తోంది. బీజెపి ప్రభుత్వం బండారం బయటపడిందని సుర్జేవాలా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీజేపీని  భారతీయ జాసూస్ పార్టీగా రణదీప్ సుర్జేవాలా అభివర్ణించారు. ప్రభుత్వం ఈ విషయం గురించి తెలిసి ఉన్నప్పటికీ మౌనంగా ఉందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 12న ఐటీ శాఖ మంత్రి ఫేస్ బుక్ ఉపాధ్యక్షుడిని కలిశారని, కానీ అతను హ్యాకింగ్ సమస్యను లేవనెత్తలేదు ఏదో ఒక రహస్యమైన నిశ్శబ్దం ఉందని సుర్జేవాలా అన్నారు.

వాట్సాప్ స్పైవేర్ దాడిపై స్పందించిన భారత ప్రభుత్వం నవంబర్ 4లోగా ఫేస్ బుక్ సొంత మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ స్పందించాలని, వెంటనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరింది.