Rahul Gandhi : భారత్ ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదు

మోదీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

Rahul Gandhi : భారత్ ఇంత బలహీనంగా ఎప్పుడూ  లేదు

Rahul (2)

Rahul Gandhi మోదీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్రప్రభుత్వం.. రక్షణ, విదేశాంగ విధానాలను దేశీయ రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారత్ రక్షణ విషయంలో ఎప్పుడూ ఇంత బలహీనంగా లేదని విమర్శించారు. తూర్పు లడఖ్ లోని పలు ప్రాంతాల్లో చైనా ఆర్మీ మరోసారి వాస్తవాధీన రేఖ దాటిందని, భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొంటూ ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్‌కు జత చేశారు.

అయితే తూర్పు లడఖ్‌లో చైనా దళాలు భారత్‌తో మళ్లీ ఘర్షణ పడ్డాయనే మీడియా కథనాలను భారత ఆర్మీ బుధవారం (జూలై- 14,2021) ఖండించింది. చైనాతో ఒప్పందాలు కుప్పకూలి.. మరోసారి లఢఖ్ ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని పేర్కొన్న వార్తా నివేదిక పూర్తిగా నిరాధారమైనదని ఆర్మీ తెలిపింది. సదరు వార్త సంస్థ ప్రచురించినట్లుగా గాల్వన్ లో కానీ మరే ఇతర ప్రాంతంలో కానీ ఎలాంటి ఘర్షణలు జరగలేదని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి భారత్, చైనా మధ్య చర్చలు మాత్రమే కొనసాగుతున్నాయని భారత ఆర్మీ సృష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్ ఆధారంగా రాహుల్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా తీవ్రంగా మండిపడ్డారు. గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న మరియు నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉన్న సుమన్ దూబే బావమరిది మరియు రిటైర్డ్ కల్నల్ అజయ్ శుక్లా ఈ ఫేక్ న్యూస్ ను తెరమీదకి తీసుకొచ్చారని మాల్వియా తెలిపారు. రాహుల్ గాంధీ కోసమే ఈ బోగస్ స్టోరీ రాశారని మాల్వియా విమర్శించారు. ఫేక్ న్యూస్ ఆధారంగా రాహుల్ ట్వీట్లు చేస్తున్నారని, అలా చేయడం ఏమాత్రం భావ్యం కాదని పలికారు.