Remote Voting : ఓటర్లకు గుడ్ న్యూస్, పోలింగ్ బూత్‌కు వెళ్లకుండానే ఓటు వేయొచ్చు

ఓటర్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇకపై పోలింగ్ రోజున బూత్‌లకు వెళ్లి ఓటేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎక్కడి నుంచైనా ఓటు వేసే సౌకర్యం అందుబాటులోకి రావొచ్చు. ఇందుకోసం..

Remote Voting : ఓటర్లకు గుడ్ న్యూస్, పోలింగ్ బూత్‌కు వెళ్లకుండానే ఓటు వేయొచ్చు

Remote Voting Facility Likely By 2024 Ls Polls1

Remote Voting Facility Likely By 2024 LS Polls : ఓటర్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇకపై పోలింగ్ రోజున బూత్‌లకు వెళ్లి ఓటేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎక్కడి నుంచైనా ఓటు వేసే సౌకర్యం అందుబాటులోకి రావొచ్చు. ఇందుకోసం ‘రిమోట్ ఓటింగ్’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం ఎన్నికల సంఘం.

అనేక కారణాల వల్ల చాలామంది ఓటు హక్కున్నా వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో ఓటింగ్ శాతం పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచైనా ఓటేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్రం ఎన్నికల కమిషన్ కసర్తత్తు చేస్తోంది. అందులో భాగమే రిమోట్ ఓటింగ్.

ఈ విధానం 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అందుబాటులోకి రావచ్చని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా అభిప్రాయపడ్డారు. శనివారం(మార్చి 20,2021) ఓ కార్యక్రమంలో పాల్గొన్న అరోరా.. రిమోట్ ఓటింగ్ గురించి ప్రస్తావించారు.

రిమోట్‌ ఓటింగ్‌కు సంబంధించిన అధ్యయనాన్ని ఈ ఏడాది మొదట్లో ప్రారంభించామని చెప్పారు. ఐఐటీ మద్రాసుతో పాటు దేశంలోని ఇతర ఐఐటీల్లోని సాంకేతిక నిపుణుల సహకారంతో దీనిపై కసరత్తు చేస్తున్నట్టుగా అరోరా వెల్లడించారు. రెండు మూడు నెలల్లో రిమోట్ ఓటింగ్ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తామని వివరించారు. కాగా, రిమోట్‌ ఓటింగ్‌ అంటే ఆన్‌లైన్‌ ఓటింగ్‌ కాదని, ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా కాదని సీఈసీ స్పష్టం చేశారు.

ఎన్నికల వ్యవస్థకి మరింత విశ్వసనీయత తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్టుగా అరోరా చెప్పారు. త్వరలోనే దీనికి తుదిరూపు వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల వారితో దీనిపై సంప్రదింపులు జరపాల్సి ఉందన్నారు. గతంలో మాజీ డిప్యూటీ ఎన్నికల అధికారి సందేప్‌ సక్సేనా ఈ ప్రాజెక్టుని ‘‘బ్లాక్‌చైన్‌’’ టెక్నాలజీ ద్వారా రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. టూ-వే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థ కలిగి ఉండే ఈ విధానంలో వైట్‌ లిస్ట్‌లో ఉండే ఐపీ పరికరాలు, వెబ్‌ కెమెరాలు, బయోమెట్రిక్‌ డివైస్‌లు వంటివన్నీ ఉంటాయన్నారు. రిమోట్‌ ఓటింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఓటర్లు ముందుగా నిర్ణయించిన సమయానికి, నిర్దేశిత ప్రాంతానికి రావల్సి ఉంటుందని అప్పట్లో సక్సేనా వెల్లడించారు.

ఆన్‌లైన్ ద్వారా ఓటు వేసే విధానాన్ని తొలిసారిగా ఈస్టోనియాలో అందుబాటులోకి వచ్చిందని, అదే విధానాన్ని మన దేశ వనరులు, సాంకేతిక పరిజ్ఙానం, ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు సునీల్ అరోరా చెప్పారు. ఇంటర్నెట్‌‌ను వినియోగించుకుని ఓటు వేసే విధానం స్విట్జర్లాండ్‌, అస్ట్రేలియా, నెదర్లాండ్స్‌.. సహా పలు దేశాల్లో అమల్లో ఉందని చెప్పారు. భద్రతా కారణాల వల్ల కొన్ని దేశాలు ఈ వ్యవస్థను ఉపసంహరించుకున్నాయని చెప్పారు. ఆ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడం ద్వారా లోపాలను అరికట్టొచ్చని చెప్పారు.

ఈ విధానంలో పారదర్శకతను పాటించడానికి సొంతంగా ఇంటర్నెట్ లైన్స్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం లేకపోలేదని సునీల్ అరోరా అన్నారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్ బూత్ స్థానంలో.. ఇంటర్నెట్ పోలింగ్ బూత్ తరహా వ్యవస్థ అందుబాటులోకి రావొచ్చన్నారు. ఐపీ డివైజెస్, టూ వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్, సొంతంగా ఇంటర్నెట్ లైన్స్, బయోమెట్రిక్, వెబ్ కెమెరా వంటి సౌకర్యాలు ఇంటర్నెట్ పోలింగ్ బూత్‌లో ఉండేలా ప్రతిపాదనలను రూపొందించామని, వాటన్నింటినీ అనుసంధానించే సమగ్ర సాంకేతిక పరిజ్ఙానాన్ని ఐఐటీ నిపుణులు అభివృద్ధి చేస్తున్నారని అరోరా వివరించారు.

అలాగే, ఎన్ఆర్ఐలకు ఓటు హక్కుకి సంబంధించి ప్రాజెక్టు ఆరు నుంచి ఏడాదిలోగా పూర్తికావచ్చని అరోరా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ-పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్ఐఆర్‌లకు ఓటు హక్కు కల్పించేలా నిబంధనలు సవరించాలనే ప్రతిపాదనలను కేంద్ర న్యాయశాఖకు ఈసీ పంపిందని తెలిపారు. ఈ అంశంపై ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత విదేశాంగ శాఖ సూచించినట్టు రాజ్యాంగ నిపుణులు, ప్రముఖులతో ఓ సెమినార్ ఏర్పాటు చేస్తామన్నారు.

అధార్‌తో ఓటును అనుసంధానం చేయాలన్న ఈసీ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఇటీవల కేంద్ర న్యాయశాఖ చేసిన ప్రకటనను సునీల్ అరోరా స్వాగతించారు. దీని వల్ల ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉంటుందని అన్నారు.

ఇదివరకు బ్యాలెట్ల పద్ధతిన ఓట్లను వినియోగించుకోవడాన్ని చూశాం. దాని తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలొచ్చాయి(ఈవీఎం). త్వరలోనే రిమోట్ ఓటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే.. అప్పుడు ఈవీఎంలు కూడా కనుమరుగయ్యే చాన్స్ లేకపోలేదు.