One Side Love : ప్రేమకు అంగీక‌రించ‌లేద‌ని.. యువ‌తిని గంజాయి కేసులో ఇరికించాడు.

తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిని గంజాయి కేసులో ఇరికించాడు. చివరకు పోలీసుల విచారణలో ఇది తప్పుడు కేసుగా తెలియడంతో సదరు వ్యక్తి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుంది. ఈ వ్యవహారం సీఎం వరకు వెళ్ళింది

One Side Love :  ప్రేమకు అంగీక‌రించ‌లేద‌ని.. యువ‌తిని గంజాయి కేసులో ఇరికించాడు.

One Side Love

One Side Love : సమాజంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. శారీరక, మానసిక హింసతో ప్రతి రోజు కొన్ని వందల మంది మహిళలు బాధపడుతున్నారు. వృత్తి, ఉద్యోగాల్లో వేధింపులు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలపై చిన్న చూపు, వేధింపులు రాను రాను అధికమవుతున్నాయి. ప్రేమ పేరుతో వేదించే వారు కొందరైతే, వరకట్న వేధింపులకు గురిచేసేవారు మరికొందరు.

మహిళలపై వేధింపుల విషయంలో పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా మార్పు కనిపించడం లేదు. తాజాగా కేరళలో జరిగిన ఓ ఘటన మహిళలపై జరుగుతున్న దాడుల్లో కొత్త కోణంగా కనిపిస్తుంది. తనను ప్రేమించలేదనే కోపంతో ఓ యువకుడు చేసిన పనికి యువతి కటకటాలపాలైంది. వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురంలోని వళుతకాడ్​లో ‘వీవర్స్​ విలేజ్​’ పేరుతో బిజినెస్ ర‌న్ చేస్తున్నారు శోభా విశ్వనాథ్​. రాష్ట్రంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్తల్లో ఆమె ఒకరు.

ఆమెకు తిరువనంతపురంలోని లార్డ్స్​ హాస్పిట‌ల్‌ సీఈఓ గా ఉన్న హరీశ్​​ హరిదాస్​తో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలోనే తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని హరీశ్ ఆమెను కోరాడు. అయితే ఆమె అందుకు నిరాకరించి హరీశ్ ను దూరం పెట్టింది. దీంతో శోభాపై కోపం పెంచుకున్నాడు హరీశ్, ఎలాగైనా ఆమెను కటకటాలపాలు చేయాలనీ పథకం పన్నాడు. ఇందుకోసం ప్లాన్ సిద్ధం చేశాడు. శోభాను జైలుకు పంపేందుకు ఆమె దగ్గర పనిచేసే వివేక్​ రాజ్​ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు.

వివేక్ సాయంతో ఈ ఏడాది జనవరి 21న, యువతికి చెందిన షాపులో గంజాయిని పెట్టించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హరీశ్ ఫిర్యాదుతో షాపు దగ్గరకు వచ్చిన పోలీసులు తనిఖీలు చేశారు. గంజాయి లభించడంతో ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. విచారణలో గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని శోభా తెలిపింది. అయితే పోలీసులకు ఆమె మాటలు నమ్మబుద్ది కాలేదు. దీంతో విచారణ వేగవంతం చేశారు.

ఈ విషయం సీఎం దృష్టికి వెళ్ళింది. వెంటనే ఈ కేసును క్రైమ్​ బ్రాంచ్​కు అప్పగించారు. విచారణ చేసిన క్రైమ్ బ్రాంచ్ అధికారులు తప్పుడు ఆరోపణగా గుర్తించారు. ఇది హరీశ్ వివేక్ కలిసి ఆడిన నాటకంగా గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకోని శోభాపై నమోదైన కేసులను కొట్టేశారు. కాగా కేరళలో ఈ ఘటన పెద్ద దుమారమే లేపింది. ప్రేమించిన యువతిని కటకటాలపాలు చేయాలనీ పథకం పన్నిన హరీశ్, అతడికి సహకరించిన వివేక్ లు జైలుపాలయ్యారు.