పొత్తు కుదిరింది : బీజేపీ 25, శివసేన 23 స్థానాల్లో పోటీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2019 / 04:34 PM IST
పొత్తు కుదిరింది : బీజేపీ 25, శివసేన 23 స్థానాల్లో పోటీ

 నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మిత్రపక్షమైన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉండే శివసేన ఒక్కసారిగా రూటు మార్చింది. బీజేపీతో కలిసి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమైంది. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన మంత్రాంగం ఫలించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 25 లోక్ సభ స్థానాల్లో బీజేపీ,23 స్థానాల్లో శివసేన పోటీ చేయనున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికంగా ప్రకటించారు. ఏవో కొన్ని చిన్న చిన్న విభేధాలు తమను కలవకుండా ఆపలేవని ఫడ్నవీస్ అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని బీజేపీ,శివసేన అంగీకరించినట్లు తెలిపారు. 2019లో ఎన్డీయే మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు.

 బీజేపీ-శివసేన కూటమి 45 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. మరో నాలుగు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెరి సగం సీట్లలో పోటీ చేయనున్నట్లు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమి మొత్తం 48స్థానాల్లో 41స్థానాలు గెల్చుకొంది. అయితే అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామిగా కొనసాగుతోంది.