DEMONETISATION EFFECT : పెద్ద నోట్ల రద్దు నుంచి డిజిటల్ రూపీ దాకా..భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు,భారీగా పెరిగిన డిజిటిల్ ట్రాన్సాక్షన్స్
దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగినప్పటికీ.. నగదు చెలామణి మాత్రం తగ్గట్లేదు. పైగా.. 2016 కంటే మరింత పెరిగింది. ఓ మాటలో చెప్పాలంటే కరెన్సీ వినియోగం పతాక స్థాయికి చేరింది. 2016 నవంబర్ 4వ తేదీ నాటికి ప్రజల వద్ద డబ్బు 17.7 లక్షల కోట్లు ఉన్నట్టు అప్పుడు ఆర్బీఐ వెల్లడించింది. గతేడాది నవంబర్ 21 నాటికి 30.88 లక్షల కోట్లుగా ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి.

DEMONETISATION EFFECT : నవంబర్ 8, 2016.. ఈ అర్ధరాత్రి నుంచి దేశంలో 500, 1000 నోట్లు చెల్లవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన ప్రకటన చేశారు. దానికంటే ముందు చాలామంది.. ఈ పెద్ద నోట్లు రద్దైపోతే బాగుండు.. అప్పుడు అక్రమార్కులు దాచిన నల్లధనం అంతా పనికిరాకుండా పోతుంది.. దేశంలో బ్లాక్ మనీ సమస్య పోతుందనేవారు. తీరా ప్రధాని అదే పని చేశాక.. ఈ అంశంపై పెద్ద చర్చే జరిగింది. కొంతమంది మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. డిమానిటైజేషన్‌తో అవినీతి అంతమైందా.. నల్లధనం మాయమైందా అనే విషయాల్ని పక్కన పెడితే.. డిజిటల్ ఎకానమీకి పెద్ద నోట్ల రద్దు ఊతం ఇచ్చింది. యూపీఐ, ఆన్‌లైన్ పేమెంట్లతో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. రోడ్డు మీద చాయ్‌బండి నుంచి ఐవ్‌స్టార్ హోటల్స్ దాకా అన్నిచోట్లా ఆన్‌లైన్ పేమెంట్లే. ఎవరి ఫోన్‌లో చూసినా ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే యాప్‌లే. అయితే డిమాజిటైజేషన్‌తో పోలిస్తే.. కరోనా తర్వాతే డిజిటల్ పేమెంట్లు ఊపందుకున్నాయి. దేశంలో ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత ప్రజలు ఆహారం, మెడిసిన్స్, బట్టల లాంటి అవసరమైన వస్తువుల కొనుగోళ్లకు ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేస్తున్నారు.
దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగినప్పటికీ.. నగదు చెలామణి మాత్రం తగ్గట్లేదు. పైగా.. 2016 కంటే మరింత పెరిగింది. ఓ మాటలో చెప్పాలంటే కరెన్సీ వినియోగం పతాక స్థాయికి చేరింది. 2016 నవంబర్ 4వ తేదీ నాటికి ప్రజల వద్ద డబ్బు 17.7 లక్షల కోట్లు ఉన్నట్టు అప్పుడు ఆర్బీఐ వెల్లడించింది. గతేడాది నవంబర్ 21 నాటికి 30.88 లక్షల కోట్లుగా ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. అంటే ఆరేళ్ల క్రితం ప్రజల వద్ద ఉన్న డబ్బు కంటే.. ఇప్పుడు 71.84 శాతం అధికంగా ఉంది. బ్యాంకుల దగ్గరున్న కరెన్సీని మొత్తం కరెన్సీ నుంచి తీసివేసి ఈ విలువను ఆర్బీఐ లెక్కిస్తుంది. బ్యాంకుల వద్ద ఉన్న కరెన్సీని తొలగిస్తే ప్రజల లావాదేవీలు, ట్రేడ్స్, గూడ్స్ కొనడం, సర్వీసులకు చెల్లించడం, అన్ని రకాల కార్యకలాపాలకు ప్రజలు ఉపయోగించే ఈ డబ్బును ఆర్బీఐపై విధంగా గణిస్తుంది.
గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయని ఆర్బీఐ చెప్తోంది. వ్యాల్యూ, వ్యాల్యూమ్‌లోనూ ఈ డిజిటల్ చెల్లింపులు పెరిగాయని వివరించింది. అదే విధంగా జీడీపీతో పోలిస్తే చలామణిలో ఉన్న కరెన్సీ నిష్పత్తి కూడా పెరుగుతూ వస్తోంది. 2017-18 నాటికి దేశ జీడీపీలో నగదు నగదు నిష్పత్తి 10.7 శాతం కాగా.. 2020-21 నాటికి 14.4 శాతానికి పెరిగింది. జీడీపీ రేషియోతో చూస్తే డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్నా.. నగదు చలామణి మాత్రం తగ్గట్లేదన్నది ఆర్బీఐ లెక్కల్ని చూస్తే తెలుస్తోంది. అయితే 2015-16 నుంచీ క్రమంగా పేమెంట్ సిస్టమ్స్‌లో నగదు తగ్గుతోందని ఎస్‌బీఐ రీసెర్చ్రిపోర్టు ఒకటి వెల్లడించింది. 2015-16లో 88 శాతంగా ఉన్న క్యాష్ పేమెంట్లు.. 2021-22 నాటికి 20 శాతానికి తగ్గిపోయినట్లు ఆ రిపోర్టు పేర్కొంది. 2026-27 నాటికి పేమెంట్సిస్టమ్స్లో నగదు చెల్లింపులు మరింత తగ్గి 11.15 శాతానికే పరిమితమవుతాయని ఈ రిపోర్టు అంచనా వేస్తోంది. ఇదే టైమ్‌లో డిజిటల్ ట్రాన్సాక్షన్లు జోరందుకున్నాయి. 2015-16 నాటికి 11.26 శాతంగా ఉన్న డిజిటల్ట్రాన్సాక్షన్లు 2021-22 నాటికి ఏకంగా 80.40 శాతానికి పెరిగాయి. ఇవి మరింత పెరిగి 2026-27 నాటికి 88 శాతమవుతాయని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ చెప్తోంది.
2016 నవంబర్ 8 నాటికి దేశంలోని 133 కోట్ల మంది దగ్గర 17.97 లక్షల కోట్ల విలువైన నగదు ఉండేది. అయితే డిమానిటైజేషన్‌తో 86శాతం ప్రజల దగ్గరున్న పెద్ద నోట్లు రద్దయిపోయాయి. ఒక్కసారిగా నగదు చెలామణి నిలిచిపోవడంతో రెండ్రోజులకు.. అంటే 2016 నవంబర్ 10 నుంచి రెండు వేల నోట్లును అమల్లోకి తీసుకొచ్చింది ఆర్బీఐ. 2016-2017 మధ్య 354.9 కోట్ల విలువైన 2 వేల నోట్లను ముద్రించి చెలామణిలోకి తెచ్చింది. ఆ తర్వాత కొత్తగా 500, 200 నోట్లను కూడా తెచ్చారు. క్రమంగా వీటి సంఖ్య పెంచుతూ 2వేల నోట్ల ముద్రణను 2019 నుంచి నిలిపివేశారు. ఇప్పుడు ఏటీఎంలలో కూడా ఎక్కడా 2వేల రూపాయల నోటు అందుబాటులో లేదు. వీటితో అవినీతి, హవాలా కార్యకలాపాలు పెరుగుతాయన్నది సర్కార్ భావన. అందుకే బ్యాంకులకు చేరుతున్న 2వేల నోటును తిరిగి వెనక్కి ఇవ్వడం లేదు. పాత నోట్లను దశల వారీగా తొలగించి కొత్త రంగుల్లో కరెన్సీ నోట్లను తెచ్చినా.. నకిలీ నోట్ల జోరు మాత్రం ఆగట్లేదు. 2016లో 2వేల నోట్లను ముద్రించగా.. అదే ఏడాదిలో 2 వేల 272 నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. 2020 నాటికి ఆ సంఖ్య 2 లక్షల 44 వేల 834కి పెరిగింది.
పెద్దనోట్ల రద్దుకు ముందు డెబిట్, క్రెడిట్ కార్డులతో పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల దగ్గర చెల్లింపులు, ఆన్‌లైన్‌లో బ్యాంక్ ఖాతాల మధ్య నగదు బదిలీ జరిగేది. 2016 ఏప్రిల్ 11న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలకు 21 బ్యాంకులతో ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పేల ప్రవేశంతో డిజిటల్ పేమెంట్స్ కొత్త పుంతలు తొక్కింది. స్కాన్ చేసి పే చేస్తే ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు ఇవ్వడంతో జనం చాలా త్వరగానే వీటికి అలవాటు పడ్డారు. యూపీఐ ద్వారా రోజుకు లక్ష వరకు నగదును బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నెంబర్లకు బదిలీ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా, ఆన్‌లైన్ చెల్లింపులూ చేయొచ్చు. ప్రస్తుతం 365 బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీ లావాదేవీల్లో ఎక్కువమంది యూపీఐనే వాడుతున్నారు. అయితే దేశంలో దాదాపు 15 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలే లేకపోవడంతో.. నగదు కూడా ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రూపీని కూడా ప్రవేశపెట్టడంతో.. భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలు ఇంకేం మలుపులు తిరుగుతాయో చూడాలి.