ఎస్పీ-బీఎస్పీ పొత్తు : మోడీ, కాంగ్రెస్‌కు నిద్రలేని రాత్రులే

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 07:31 AM IST
ఎస్పీ-బీఎస్పీ పొత్తు : మోడీ, కాంగ్రెస్‌కు నిద్రలేని రాత్రులే

లక్నో: దేశంలోనే అతి పెద్ద, కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య పొత్తు పొడిచింది. ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. 80 లోక్‌సభ స్థానాల్లో చెరో 38 స్థానాల నుంచి పోటీ చేస్తామని మాయావతి, అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఇకపై మోదీ, అమిత్ షాలకు నిద్రలేని రాత్రులే అని మాయావతి అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యం అన్నారు.

* మొత్తం సీట్లు 80
* 38 స్థానాల్లో ఎస్పీ పోటీ
* 38 స్థానాల్లో బీఎస్పీ పోటీ
* రెండు స్థానాలు ఇతరులకు
* అమేథీ, రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు

బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేవుడు కూడా బాధపడ్డాడని మాయావతి మండిపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా కూటమి పని చేస్తుందన్నారు. విద్వేషాలు సృష్టించి ప్రజలను విడదీయాలని బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రాత్మక అవసరమే ప్రాతిపదికగా కూటమి ఏర్పడిందని మాయావతి చెప్పారు. యూపీ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నారని, ఎస్పీ-బీఎస్సీ కలిసి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాయావతి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, దళితుల ప్రయోజనాల కోసం.. కొత్త రాజకీయ విప్లవానికి నాంది పలికేందుకే ఈ పొత్తు అని వివరించారు. దేశంలోని కోట్లాదిమంది ప్రజలు మోదీ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని.. రైతులు, నిరుద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాయావతి చెప్పారు. ఉపఎన్నికల స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి బుద్ది చెప్తామన్నారు. అమేథీ, రాయ్‌బరేలీలో మాత్రం పోటీ చేయడం లేదని మాయావతి చెప్పారు.

తమతో పొత్తుకు అంగీకారం తెలిపినందుకు మాయావతికి అఖిలేష్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చించలేదని, కాంగ్రెస్‌కు యూపీలో బలం లేదని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఎన్‌కౌంటర్ పేరుతో నిమ్నకులాలు, మైనార్టీలపై దాడులు జరిగాయన్నారు.