ఆర్మీ కమాండ్ పోస్టులకు మహిళలు అర్హులే..శాశ్వత హోదా మంజూరు చేయాలి : సుప్రీం

  • Published By: madhu ,Published On : February 17, 2020 / 07:57 AM IST
ఆర్మీ కమాండ్ పోస్టులకు మహిళలు అర్హులే..శాశ్వత హోదా మంజూరు చేయాలి : సుప్రీం

ఆర్మీలో మహిళా అధికారుల విషయంలో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. వీరికి శాశ్వత కమిషన్ హోదా మంజూరు చేయాలని సూచించింది. వారి శారీరక లక్షణాలకు..హక్కులతో సంబంధం లేదు..మనస్తత్వం మారాలి…నిబంధనలు పురుషుల మాదిరిగానే ఉండాలి..అసమానత్వపు ధోరణి విడనాడాలి..శారీరక లక్షణాలు కారణంగా చూపొద్దు..వారి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం తప్పు..అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఈ తీర్పును కేవలం మూడు నెలల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2020, ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ పలు సూచనలు చేసింది. మహిళా అధికారుల నియామకాల విషయంలో నిబంధనలు పురుషుల మాదిరిగానే వారికి ఉండాలని తేల్చిచెప్పింది.

ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్మీలో మహిళలకు పురుషులతో సమానంగా కమిషన్ హోదా ఇవ్వాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు- కేంద్రంపై  అక్షింతలు వేసింది. మహిళల సామర్థ్యంపై ప్రభుత్వం తమ ఆలోచనా ధోరణి మార్చుకోవాలని సూచించింది. మహిళల హక్కులకు శారీరక లక్షణాలతో సంబంధం పెట్టడం సరికాదని పేర్కొంది. కమాండ్‌ విధులకు మహిళా అధికారులు కూడా అర్హులేనని తేల్చిచెప్పింది.   

భారత ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ కల్పిస్తూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్మీలో చాలా మంది జవాన్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారని… కమాండ్‌ హోదాలో మహిళా అధికారులను అంగీకరించేందుకు వారు మానసికంగా సిద్ధంగా లేరని ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం నివేదికపై విచారణ జరిపిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృతృంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాయుధ బలగాల్లో లింగ వివక్షలను తొలగించాలంటే ప్రభుత్వం తన ఆలోచన ధోరణి మార్చుకోవాలని మొట్టికాయలు వేసింది. మహిళా అధికారులకు కమాండ్‌ పోస్టులకు నిషేధించడం సమానత్వ హక్కులకు వ్యతిరేకమని కోర్టు అభిప్రాయపడింది.

ఆర్మీలో మహిళా అధికారులందరికీ మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్‌ కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.. సర్వీసుతో సంబంధం లేకుండా  శాశ్వత కమిషన్‌ మహిళా అధికారులందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. 

కల్నల్ అంతకంటే ఎక్కువ స్థాయికి, టెక్నికల్‌గా మహిళలు అత్యున్నతస్థాయికి ఎదగవచ్చని ఎదగవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC)లో 14 ఏళ్లకు పైగా సేవలందించిన మహిళలు కూడా శాశ్వత కమిషన్ ఎంపిక చేసుకోవచ్చని సూచించింది. 

ప్రస్తుతం మహిళా అధికారులు షార్ట్ సర్వీసు కమిషన్‌లో 10 నుంచి 14 సంవత్సరాలు పనిచేయవచ్చని తెలిపింది. కోర్టు తీర్పును మహిళా ఆర్మీ  అధికారులు స్వాగతించారు. కోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.