తమిళనాడులో ఉదయించిన సూర్యుడు..తొలిసారి సీఎంగా స్టాలిన్

తమిళనాడులో ఉదయించిన సూర్యుడు..తొలిసారి సీఎంగా స్టాలిన్

Tamil Nadu Election Results Stalin Led Dmk Crosses Halfway Mark

TAMILNADU త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే విజయం ఖాయ‌మైంది. మొత్తం 234 స్థానాల్లో..డీఎంకే కూటమి 146స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,ఏఐఏడీఎంకే కూటమి 87స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక,చెన్నైలోని మొత్తం 16 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చానంటూ ప్రచారం నిర్వహించిన డీఎంకే అధినేత స్టాలిన్‌ను ఆశీర్వదిస్తూ తమిళనాడు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. దీంతో డీఎంకేలో కరుణానిధి తర్వాత సీఎం పదవి చేపట్టబోయే మొదటి వ్యక్తిగా స్టాలిన్‌ తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సుస్థిరం చేసుకోనున్నారు.

ఇక, ప‌దేళ్ల త‌ర్వాత డీఎంకే పార్టీ మ‌ళ్లీ అధికారం చేజిక్కించుకోబోతుండటంతో డీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం వెనుక డీఎంకే అధినేత స్టాలిన్ కీల‌క పాత్ర పోషించారు. అన్నీ తానై న‌డిపించి పార్టీని విజ‌యం వైపు న‌డిపించారు. క‌రుణానిధి మ‌ర‌ణం త‌ర్వాత వార‌స‌త్వ పోరును త‌ట్టుకుని డీఎంకే ప‌గ్గాలు చేప‌ట్టిన స్టాలిన్‌..పార్టీ బ‌లోపేతానికి చాలా కృషి చేశారు. ఒక‌వైపు బ‌హిష్కృత నేత‌, త‌న అన్న అళ‌గిరి నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు ఎదుర‌య్యే తిరుగుబాటును స‌మ‌ర్థంగా ఎదుర్కొంటూ.. మ‌రోవైపు అస‌మ్మ‌తి నేత‌ల‌ను బుజ్జ‌గిస్తూ పార్టీని ఒక్క తాటిపై న‌డిపి ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యానికి కార‌ణ‌మ‌య్యారు. మరోవైపు,డీఎంకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన విషయం తెలిసిందే. డీఎంకే విజయంలో పీకేది కూడా కీలక పాత్రే.