14కిలోల బంగారు ఆభరణాలు, 600కిలోల వెండి వస్తువులు.. సమాచారశాఖ పరిధిలోకి అమ్మ నివాసం

  • Published By: naveen ,Published On : July 27, 2020 / 09:51 AM IST
14కిలోల బంగారు ఆభరణాలు, 600కిలోల వెండి వస్తువులు.. సమాచారశాఖ పరిధిలోకి అమ్మ నివాసం

పోయస్ గార్డెన్ లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేదనిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడా ఇంటిని చెన్నై జిల్లా కలెక్టరేట్‌ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తెచ్చారు. త్వరలో ట్రస్ట్‌కు అప్పగించనున్నారు. ప్రస్తుతం సేకరించిన జాబితా మేరకు అమ్మ ఇంట్లో 8 వేల వస్తువులు ఉన్నట్టు తేలింది. దివంగత సీఎం జయలలితకు పోయెస్‌గార్డెన్‌లో వేదనిలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇంటిని తన గుప్పెట్లోకి తీసుకునేందుకు పాలకులు ప్రయత్నించి ఫలితాన్ని సాధించారు. ఆ ఇంటిని అమ్మ స్మారక మందిరంగా మార్చనున్నారు. ఇందుకోసం సీఎం, డిప్యూటీ సీఎంల నేతృత్వంలో ట్రస్ట్‌ ఏర్పాటైంది.

న్యాయపరంగా చిక్కులు రాకుండా ప్రత్యేక చట్టం:
న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అలాగే, అమ్మ కుటుంబవారసులుగా ఉన్న దీప, దీపక్‌ల నుంచి భవిష్యత్తులో చిక్కులు ఎదురుకాని రీతిలో ఆ ఇంటిని కొనుగోలు చేస్తూ, అందుకు తగ్గ నగదు బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారు. అయితే, దీనిని దీప తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో న్యాయ పోరాటం అన్న ప్రకటన చేశారు. ఈ పరిస్థితుల్లో అమ్మ ఇంటిని ప్రస్తుతం చెన్నై జిల్లా కలెక్టరేట్‌ పరిధి నుంచి సమాచార శాఖ పరిధిలోకి తీసుకురావడం గమనార్హం. త్వరలో ఆ ట్రస్ట్‌కు ఈ ఇంటిని అప్పగించబోతున్నారు. కలెక్టరేట్‌ నుంచి సమాచార శాఖకు వచ్చిన సమాచారాల మేరకు ఆ ఇంట్లో ఉన్న వస్తువుల చిట్టా వెలుగు చూసింది.

Poes Garden residence, three other properties of Jayalalithaa ...

అమ్మ ఇంట్లో వేల వస్తువులు:
* అమ్మ ఇంట్లో 32 వేల 700 పుస్తకాలు
* 8వేల 376 వస్తువులు
* 14 కేజీల బరువుండే 437 బంగారు ఆభరణాలు
* 601.4 కేజీల బరువుండే 867 వెండి వస్తువులు
* ఆరు వేల పాత్రలు
* 556 ఫర్నీచర్లు
* 162 చిన్న చిన్న వెండి వస్తువులు
* 108 అలంకరణ వస్తువులు
* 29 ఫోన్లు, సెల్‌ఫోన్లు, 15 పూజా సామగ్రి
* పది ఫ్రిడ్జ్‌లు, 38 ఎసీలు, 11 టీవీలు, ఆరు గడియారాలు ఉన్నట్టుగా లెక్క తేల్చారు.
* అలాగే 10వేల 438 వివిధ వస్త్రాలు ఉన్నట్టు తేల్చారు.

త్వరలో ట్రస్ట్ కు అప్పగింత, స్మారక మందిరంగా అమ్మ నివాసం:
వీటన్నింటిని ట్రస్ట్‌కు మరి కొద్ది రోజుల్లో అప్పగించబోతున్నారు. ఈ వస్తువుల్లో కొన్నింటిని అమ్మ స్మారక మందిరంలో ప్రజల సందర్శన కోసం ఉంచే అవకాశాలు ఎక్కువేనని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, వేద నిలయంను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవడంతో ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు. ఆ ఇంటి వైపుగా అధికారులు తప్ప, మరెవ్వరూ వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Poes Garden: From Jayalalithaa residence to memorial

బ్యాంకులో రూ.36కోట్లు జమ చేసి వేదనిలయం స్వాధీనం:
వేదనిలయం 24వేల 322 స్వ్కేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉంది. ఈ భవనం విలువ రూ.29.33 కోట్లు. స్వ్కేర్ ఫీట్ ధర రూ.12వేల 60. ఈ ఇల్లు, అందులో ఉండే వస్తువుల విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.67.9 కోట్లు. ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది ప్రభుత్వం. సిటీ సివిల్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జితో ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయించారు. కాగా దివంగత సీఎం జయలలిత రూ.36.87 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని, దాంతో ఆమె ఆస్తులను అటాచ్ చేసినట్టు ఐటీ శాఖ తెలిపింది.