తెలంగాణ బాటలోనే తమిళనాడు, పుదుచ్చేరిల్లోనూ పదో తరగతి పరీక్షలు రద్దు

  • Published By: murthy ,Published On : June 9, 2020 / 11:14 AM IST
తెలంగాణ బాటలోనే తమిళనాడు, పుదుచ్చేరిల్లోనూ పదో తరగతి పరీక్షలు రద్దు

తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.  విద్యార్ధులందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలోని 9 లక్షల మంది విద్యార్ధులకు ఉపశమనం లభించింది. 

అలాగే 11 వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు పళని స్వామి తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నందున విద్యార్ధుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని  ఈచర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 80 శాతం మార్కులు,  హాజరు ఆధారంగా 20 శాతం మార్కులు లెక్కగట్టి  పై క్లాసులకు ప్రమోట్ చేస్తున్నట్లు సీఎం చెప్పారు. 

మొదట జూన్ 15 నుంచి 10వతరగతి పరీక్షలు నిర్వహిచేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ నేపధ్యంలో పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని మద్రాసు హై కోర్టు ప్రభుత్వానికి సూచించటంతో….నిపుణులతో చర్చించిన ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది.

తమిళనాడులో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు సిధ్దమవుతుండగా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. తెలంగాణాలో మాదిరిగా రాష్ట్రంలోనూ పరీక్షలను వాయిదా వేసి విద్యార్ధులను ప్రమోట్ చేయాలని డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. 3,650 కరోనా పాజిటివ్  కేసులున్న తెలంగాణ లోనే పరీక్షలు రద్దు చేసినప్పుడు 33 వేల పైచిలుకు కేసులున్నతమిళనాడులో పరీక్షలు నిర్వహించకపోవటమే మంచిదని స్టాలిన్ అభిప్రాయ పడ్డారు.
 
కాగా తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ పదో తరగతి పరీక్షలను రద్జు చేశారు. అక్కడ కూడా విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. 

Read: తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ ఇలా ఇస్తారు