పాపం పేదవాళ్లంట : మంత్రుల ఆదాయపుపన్ను కట్టిన యూపీ ప్రభుత్వం

  • Published By: venkaiahnaidu ,Published On : September 13, 2019 / 03:59 AM IST
పాపం పేదవాళ్లంట : మంత్రుల ఆదాయపుపన్ను కట్టిన యూపీ ప్రభుత్వం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,అతని కేబినెట్ మంత్రులందరీ  ఆదాయపు పన్నుని యూపీ ప్రభుత్వమే చెల్లించింది. గత రెండు ఆర్థికసంవత్సరాల నుంచి సీఎం యోగి,మంత్రలు ఆదాయపు పన్నుని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. ఈ ఏడాది కూడా  సీఎం,మంత్రులు కట్టవలసిన ఆదాయపు పన్ను బిల్లు సుమారు రూ .86 లక్షలు, రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించారు. 1981 చట్టం ప్రకారం తప్పనిసరి గా సీఎం,మంత్రుల ఆదాయపు పన్ను బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్లు యూపీ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్) సంజీవ్ మిట్టల్  ధృవీకరించారు.

నాలుగు దశాబ్దాల ఉత్తర ప్రదేశ్ చట్టం… సీఎం, మంత్రి వర్గం రాష్ట్ర ఖజానాపై పన్ను భారాన్ని మోపుతూనే ఉంది. పేదలు, స్వల్ప ఆదాయాల కారణంగా ఆదాయపు పన్ను చెల్లించలేరు అని చెబుతూ నాలుగు దశాబ్దాల నుంచి యూపీని పాలించిన సీఎంలు,మంత్రలు కట్టాల్సిన ఆదాయపు పన్నుని రాష్ట్ర ఖజానా కడుతోంది. అయితే ఈ మంత్రులలో చాలామంది…ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో తమకు  కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తి,చరాస్తి ఉన్నట్లు తెలిపినవారే. 

వీపీ సింగ్ సీఎంగా ఉన్న సమయంలో ఉత్తరప్రదేశ్ మంత్రుల జీతాలు, అలవెన్సులు,  ఇతర చట్టం 1981 బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా వీపీ సింగ్ అసెంబ్లీలో మాట్లాడుతూ…చాలా మంది మంత్రులు పేద నేపథ్యం నుండి వచ్చినవారు, తక్కువ ఆదాయాలు ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదాయపు పన్ను భారాన్ని భరించాలని చెప్పారు. ప్రతి మంత్రి మరియు రాష్ట్ర మంత్రికి తన పదవీకాలం మొత్తం నెలకు వెయ్యి రూపాయల వేతనం లభిస్తుంది. ప్రతి ఉప మంత్రి తన కార్యాలయ వ్యవధిలో నెలకు ఆరు వందల యాభై రూపాయల వేతనానికి అర్హులు.  ఉప-సెక్షన్లు (1) మరియు (2) లో సూచించిన జీతం అమలులో ఉన్న కాలానికి ఆదాయపు పన్నుకు సంబంధించిన ఏదైనా చట్టం ప్రకారం అటువంటి జీతానికి సంబంధించి (పై ఆదాయంతో సహా) చెల్లించవలసిన పన్ను నుండి ప్రత్యేకంగా ఉండాలి,ఆ పన్ను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ వరకు 19మంది ముఖ్యమంత్రులు,దాదాపు 1000మంది మంత్రులను ఉత్తరప్రదేశ్ చూసింది. 

 గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో యోగి మంత్రివర్గ సభ్యులు కూడా తమ ఆదాయపు పన్నును రాష్ట్ర ఖజానా నుండి జమ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదిత్యనాథ్ మరియు ఆయన మంత్రి మండలి ఆదాయపు పన్ను బిల్లు సుమారు రూ .86 లక్షలు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించారు.