నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు : కేంద్రమంత్రి పీయూష్ గోయల్

స్పైస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 08:49 AM IST
నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు : కేంద్రమంత్రి పీయూష్ గోయల్

స్పైస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

స్పైస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పసుపు పంట ఎగుమతులపై ప్రత్యేక దృష్టితో బోర్డు పనిచేస్తుందని చెప్పారు. పసుపు సహా మిగతా మసాలా దినుసుల కోసం కార్యాలయం పనిచేస్తుందన్నారు. 

పసుపు పంట నాణ్యత, దిగుబడి పెంచే విషయంలో బోర్డు ప్రాంతీయ కార్యాలయం పని చేస్తుందన్నారు. రైతులకు అంతర్జాతీయ బయ్యర్లతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందన్నారు. నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించామని చెప్పారు. పసుపు, మిరప పంటను దృష్టిలో పెట్టుకునే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పీయూష్ గోయల్ అన్నారు. నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఎక్కువే ఇచ్చామని తెలిపారు. ఇది నిజామాబాద్ రైతులకు కేంద్రం ఇచ్చిన బహుమతి అని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.

ప్రస్తుత డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి కేంద్రం పెంచనుంది. ఐఏఎస్ హోదా డైరెక్టర్ స్థాయి అధికారితో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. ప్రాంతీయ కార్యాలయం నేరుగా కేంద్ర మంత్రిత్వశాఖకు నివేదించనుంది. ఇప్పటివరకు కేరళలో స్పైస్ బోర్డు ఉండగా… ప్రస్తుతం తెలంగాణలో మరో స్పైస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పసుపు పంట నాణ్యత, మద్దతు ధర అంశాన్ని ఈ బోర్డు పర్యవేక్షించనుంది.

ఎన్నో ఏళ్లుగా నిజామాబాద్ రైతులు పసుపు బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు అనేక పోరాటాలు చేశారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఆ దిశగా కృషి చేయకపోవడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో బోర్డు ఏర్పాటు చేయాలని సుమారు 190 మంది రైతులు ఎన్నికల్లో పోటీ చేసి నిరసన తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రకటించకుండా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 

పసుపు బోర్డు ఏర్పాటు, పసుపుకు మద్దతు ధరపై కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పసుపు రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌, కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని పసుపు రైతులు ఆవేదన చెందుతున్నారు. బడ్జెట్‌ తమను తీవ్ర నిరాశపర్చిందని అంటున్నారు. ఈ క్రమంలో పసుపు రైతుకు మళ్లీ ధర దిగాలు పట్టుకుంది. ప్రస్తుతం పసుపు తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పంట మార్కెట్‌కు తరలించడమూ ప్రారంభమైంది. కానీ, ఎప్పటిలాగే ధర మాత్రం నిరాశాజనకంగానే కనిపిస్తున్నది. నిజామాబాద్‌ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.4,600 మించి ధర లేదు. ఆరుగాలం సాగుచేసిన పసుపును ఆశలతో మార్కెట్‌కు తరలిస్తే ..నిరాశే మిగులనుందా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. ఏటా పసుపు రైతుకు ఈ నైరాశ్యాన్ని ఎదుర్కొంటూ వస్తున్నాడు. 

కానీ, ఈ సారి పసుపు రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. పసుపుకు మద్దతు ధర తెస్తానని హామీ ఇచ్చి ఎంపీగా గెలిచిన అర్వింద్‌.. ఎన్నికల్లో ఈ మేరకు హామీ ఇచ్చిన బీజేపీ సర్కారు నుంచి ఉలుకు పలుకు లేకపోవడం ఇందుకు కారణం. గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని సార్వత్రిక ఎన్నికల వేళ అర్వింద్‌ చెబితే నమ్మి ఓటేసిన రైతులు.. ఈసారి పంట దిగుబడి కాలానికల్లా పసుపు బోర్డు ఉపయోగాలు చూస్తామనుకున్నారు. ఈ సారి పంట మార్కెట్‌కు తరలించే సరికి పసుపుకు మద్దతు ధరను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, మద్దతు ధర పెంచకుండా ఓట్లేయించుకుని నిరాశ మిగిల్చారని పసుపు రైతులు దిగాలు చెందుతున్నారు.