ఫ్రాన్స్ లోని విజయ్ మాల్యా ఆస్తులు సీజ్

ఫ్రాన్స్ లోని విజయ్ మాల్యా ఆస్తులు సీజ్

Vijay Mallya’s Assets భారతీయ బ్యాంకుల‌కు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్ ప‌రారైన లిక్కర్ కింగ్ విజ‌య్‌మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ED)మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఫ్రాన్స్‌లో మాల్యాకి ఉన్న దాదాపు 1.6 మిలియన్ యూరోల విలువైన ఆస్తులను శుక్రవారం(డిసెంబర్-4,2020)ఈడీ స్వాధీనం చేసుకున్న‌ది.



ఈడీ చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు ఫ్రాన్స్‌ లోని 32 అవెన్యూ FOCHలోని విజ‌య్ మాల్యా ప్రాపర్టీని ఫ్రెంచ్ అధికారులు సీజ్ చేశారు. భారత కరెన్సీలో స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు రూ.14 కోట్లు. కింగ్ షిషర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ కి చెందిన బ్యాంక్ అకౌంట్ నుంచి విదేశాలకు పెద్ద సంఖ్యలో డబ్బులు తరలించబడ్డాయని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు 11వేల231కోట్ల విలువైన మాల్యా ఆస్తులను అటాచ్ చేసినట్లు ఆ ప్రకటనలో ఈడీ పేర్కొంది.



మరోవైపు,లండన్ నుంచి మాల్యాను తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్ర‌స్తుతం మాల్యా బెయిల్‌పై ఉన్నాడు. మాల్యాని భార‌త్‌ కు ర‌ప్పించేందుకు చట్టప‌ర‌మైన సమస్యలు ఉన్నాయ‌ని, అవ‌న్నీ ప‌రిష్కారం అయిన త‌ర్వాత‌నే మాల్యాను అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఈడీ అధికారులు చెప్తున్నారు.



కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న పెద్ద మొత్తంలో రుణాలు చెల్లించ‌కుండా 2016లో విజ‌య్‌మాల్యా లండన్ కి పారిపోయిన విషయం తెలిసిందే. బ్యాంకులకు అసలు, వడ్డీ క‌లిపి మొత్తం రూ.9,000 కోట్లు మాల్యా చెల్లించాల్సి ఉంది.



అయితే,భారతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న వేలకోట్ల రూపాయలను 100శాతం చెల్లించేందుకు తాను సిద్దమేనని మాల్యా చెబుతున్నారు. తన ఆఫర్ ను భారత ప్రభుత్వం అంగీకరించి తనపై చేసిన మనీలాండరింగ్,మోసం వంటి కేసులను మూసివేయాలని కోరుతున్నారు. అటాచ్ చేసిన తన ఆస్తులను రిలీజ్ చేసి అమ్ముకోవడానికి వీలు కల్పిస్తే వాటిని అమ్మి రుణాలను తీర్చుతానని మాల్యా చెబుతున్న విషయం తెలిసిందే