Phoolan Devi: 18 జిల్లాల్లో బందిపోటు రాణి ఫూలన్‌దేవి విగ్రహాలు

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న బంజరు భూమి చంబల్ ప్రాంతం. కొండలు, గుట్టలు, డొంకలు, లోయలతో ఉన్న చంబల్ ప్రాంతాన్ని ఏలిన బందిపోటు రాణి ఫూలన్ దేవి.

Phoolan Devi: 18 జిల్లాల్లో బందిపోటు రాణి ఫూలన్‌దేవి విగ్రహాలు

Poolan

Phoolan Devi: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న బంజరు భూమి చంబల్ ప్రాంతం. కొండలు, గుట్టలు, డొంకలు, లోయలతో ఉన్న చంబల్ ప్రాంతాన్ని ఏలిన బందిపోటు రాణి ఫూలన్ దేవి. కింది స్థాయి కులం మహిళపై అత్యాచారం జరిగిందన్న వార్త చర్చనీయమైన ప్రతిసారీ ఫూలన్ దేవి కథను ఇక్కడ గుర్తు చేసుకుంటారు. ‘‘న్యాయం జరగకపోతే ఫూలన్ మార్గంలో వెళ్తాం’’ అంటుంటారు అక్కడి ప్రజలు.

కొంతమంది కిరాతకురాలు అని పిలిచినా.. కొందరు వీరనారిగా అభివర్ణించినా పూలన్ దేవి విగ్రహాలను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చెయ్యబోతున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వికాషీల్ ఇన్సాన్ పార్టీ (VIP) ప్రకటించింది. నిషాద్ సమాజాన్ని ఆకర్షించే చర్యలో భాగంగా జూలై 25న ఉత్తరప్రదేశ్‌లోని 18నిషాద్ ఆధిపత్య జిల్లాల్లో దివంగత డాకోయిట్ ఫూలన్ దేవి బంగారు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. 20వ మరణ వార్షికోత్సవం సందర్భంగా మొత్తం 18 జిల్లాల్లో వేడుకలు నిర్వహించి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు VIP చీఫ్ ముఖేష్ సాహ్ని ప్రకటించారు. ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రభుత్వంలో భాగమైన సాహ్ని జూలై 2న తన పార్టీ ఉత్తరప్రదేశ్ యూనిట్‌ను ప్రారంభించారు.

అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే ఫూలాన్ దేవి విగ్రహాన్ని వారణాసి అధికారులు జప్తు చేశారు. ఈ విగ్రహాలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయనే ఉద్ధేశ్యంతో విగ్రహాలను వ్యవస్థాపించక ముందే జప్తు చేశారు అధికారులు. యూపీలోని 18 జిల్లాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయాలని భావించగా.. ఈ విగ్రహాలను ట్రక్కుల ద్వారా యూపీకి పంపారు. ఈ విగ్రహాలను వారణాసితో పాటు లక్నో, బల్లియా, సంత్ కబీర్ నగర్, బండా, అయోధ్య, సుల్తాన్‌పూర్, గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్, ప్రయాగ్రాజ్, ఉన్నవో, మీరట్, మిర్జాపూర్, సంత్, మువిజార్‌లలో ఏర్పాటు చెయ్యాలని అనుకున్నారు.


ఉత్తరప్రదేశ్‌లో యమునా నది తీరాన, ఒక మారుమూల గ్రామమైన ‘గోర్ఖాకా పూర్వా’లో 1963 ఆగస్టు 10న ఫూలన్‌ దేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు, నదిపై పడవలు నడిపే సాంప్రదాయక వృత్తిగల అత్యంత వెనకబడిన సామాజిక వర్గమైన మల్లా కులస్తులు. చిన్నప్పటి నుంచి ఫూలన్‌ దేవి పశువులు కాచేది. యమునా నదిలో ఈదుతూ పడవలు నడిపింది. పాముల్నికొట్టింది. బరువులు మోస్తూ.. మగవారికి ఏం తక్కువ కాదు అన్నట్లుగా పొలం పనులు చేసేది. భూమి, సంపద, అధికారం కలిగిన అగ్రకుల ఠాకూర్ల దర్పాలనూ, దాష్టీకాలనూ చూస్తూ పెరిగింది.

1981 ఫిబ్రవరి 14న బెహ్మాయ్‌లో ఠాకుర్ వర్గానికి చెందిన 30 మందిని కొందరు ఓ గట్టు మీదకు తీసుకువెళ్లారు. వారిలో 22 మందిని కాల్చి చంపారు. ఈ ఘటన జరిగినప్పటికి ఫూలన్‌ వయసు 18 ఏళ్లు. అంతకు ఏడాది ముందు బెహ్మాయ్‌లోనే ఠాకుర్ వర్గానికి చెందిన కొందరు ఫూలన్‌పై సామూహిక అత్యాచారం చేశారని చెబుతూ ఉంటారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆమె సొంతంగా బందిపోట్ల ముఠాను తయారుచేసుకుందని అంటుంటారు.

ఫూలన్‌దేవి 1983లో ఎనిమిదేళ్లకే విడిచిపెడుతాం అనే షరతుతో ప్రభుత్వానికి లొంగిపోయారు. అయితే, మాట తప్పిన ప్రభుత్వాలు, ఫూలన్‌ దేవిని గ్వాలియర్‌, తీహార్‌ జైళ్ళలో పదకొండేళ్ళు ఉంచాయి. తర్వాత ఫూలన్‌ దేవి 34వ ఏట 1998లో ఉత్తప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీ నుంచి పార్లమెంటు సభ్యరాలిగా ఎన్నికయ్యారు. తన 37వ ఏట 2001 జూలై 25న గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో తుపాకీ కాల్పుల్లో హత్యకు గురయ్యారు. 1981లో బెహ్మాయ్‌ గ్రామంలో 22మంది ఠాకూర్లను చంపినందుకుగాను ఫూలన్‌ దేవిని హత్య చేశారని అంటుంటారు. ఫూలన్ చనిపోయి 20 ఏళ్లు అవుతోంది.