కశ్మీర్ కష్టాలు: రాహుల్‌కు కన్నీటితో వినతి

  • Published By: madhu ,Published On : August 25, 2019 / 06:16 AM IST
కశ్మీర్ కష్టాలు: రాహుల్‌కు కన్నీటితో వినతి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ మహిళ రాహుల్ వద్దకు వచ్చి తన సమస్యలు చెప్పుకుంటూ ఏడ్చేసింది. ఆమె చెబుతున్న మాటలను రాహుల్‌ సీటులో కూర్చొని విన్నారు. విమానంలో ఉన్న కొంతమంది సెల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. కశ్మీర్‌లో తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరవు పెట్టింది.

ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని వాపోయింది. సొంత నివాసంలో బందీలు కావాల్సి వచ్చిందని..తమ పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోతున్నామని తెలిపింది. తన సోదరుడు హార్ట్ పేషెంట్ అని..పది రోజులుగా డాక్టర్‌ని రానివ్వడం లేదని విలపించింది. తాము ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. అన్ని ఓపికగా విన్న..రాహుల్ ఆమెకి భరోసా ఇచ్చారు. చేతిలో చేయి వేసి ఓదార్చారు. అక్కడున్న నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్ ఇతరులు సైతం శ్రద్ధగా విన్నారు. 

Read More : వైరల్‌గా మారిన మెట్రో ట్రైన్ సూసైడ్
జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, 35 ఏను రద్దు చేసింది. దీంతో అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్‌లో టెన్షన్..టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా భధ్రతను మోహరించారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలుసుకొనేందుకు రాహుల్, విపక్ష పార్టీలకు చెందిన నేతలు శ్రీనగర్‌కు 2019, ఆగస్టు 24వ తేదీ శనివారం విమానంలో వెళ్లారు. కానీ అక్కడి అధికారులు నో చెప్పడంతో తిరిగి వెనక్కి వచ్చారు.