Cotton : పత్తిలో కలుపు నివారణ.. యాజమాన్యం..

కలుపు వచ్చిన తరువాత యాంత్రిక పద్ధతులు,అంతర కృషి, జీవ నియంత్రణ, రసాయన పద్దతుల ద్వారా నివారించుకోవాలి.

Cotton : పత్తిలో కలుపు నివారణ.. యాజమాన్యం..

Cotton

Cotton : తెలుగు రాష్ట్రాల్లో పండిస్తున్న వాణిజ్య పంటల్లో పత్తి పంట ముఖ్యమైనది. పత్తి పంటను నల్ల రేగడి నేలల్లో వర్షాధారంగానూ, తేలిక నేలల్లోనీటి వసతితో పండిస్తున్నారు. పత్తి పైరు ముఖ్యంగా వర్షాధారంగా పండించబడడం, వాతావరీలంలో ఒడిదుడుకులు ఊండడం, పైరు మొదటిదశలో పెరుగుదల చాలా నెమ్మదిగా ఉండడం, సాళ్ళ మధ్య దూరం ఎక్కువగా ఊండడం, ఎరువులు అధికంగా వాడడం వల్ల కలుపు ఎక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది.

పత్తి మొక్కలతో పోటీపడి కలుపు మొక్కలు నీరు, పోషకాలు, వెలుతురు గ్రహించి పత్తి మొక్కల పెరుగుదలను,తగ్గించి తద్వారా దిగుబడులు తగ్గిస్తాయి. కలుపు మొక్కలు పత్తి మొక్కకంటే 5-6 రెట్లు ఎక్కువ నత్రజని, 5-12 రెట్లు ఎక్కువ భాన్వరం, 2-5 రెట్లు ఎక్కువ పొటాషియం పోషకాలను గ్రహిస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. ఇంతేకాకుండా చీడపీడలకు, అవాసాలుగా ఉంటాయి. దీనివల్ల దాదాపు 50-80 శాతం వరకు పత్తి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కలుపు మొక్కల కారణంగా, పోషకాలు సరిగా అందకపోవడంతో పత్తి నాణ్యత కూడా తగ్గుతుంది. తద్వారా పత్తి రైతుకు సాగు ఖర్చు పెరిగి నికరాదాయం తగ్గుతుంది.

గరిక, తుంగ, దర్భగడ్డి, నేల ఉసిరి, ఉత్తరేణి, పాయలాకు, తుత్తురు, బెండ, వయ్యారి భామ, లింగ మిరియాలు, గురివి, ఆమడకాయ, పిచ్చి తోటకూర, చెంచలి, గల్డేరు కాడ, పారాశి కంప, పాలకాడ మొదలగునవి. పత్తి విత్తిన మొదటి 60 రోజుల కలుపుకు చాలా కీలకం. ఈ దశలో కలుపు నివారించుకోలేకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. సాధారణంగా తొలిదశలో కలువు నివారణ జరిగినట్లయితే పత్తి మొక్కలో ఎదుగుదల ఉంటుంది. పత్తి విత్తిన మొదటి దశలో గట్ల మీద పెరిగే కలుపు మొక్కలైన వయ్యారిభామ, పిచ్చి బెందలు, రసంపీల్చు పురుగు పిండినల్లికి అవాసాలుగా మారుతాయి. తరువాత పత్తిని ఆశించి తీవ్ర నష్టాన్నికలిగిస్తాయి.

వేసవిలో లోతు దుక్కులు దున్నడం ద్వారా మరియు స్టేలోసీడ్‌ బెడ్‌ టెక్నిక్‌ను అనుసరించడం ద్వారా పొలంలో కలువు రాకుండా నివారించవచ్చు. అంటే పంట వేయడానికి ముందు నేలపై తేలికగా నీరు పారించినట్లయితే తొలకరి వర్షాలకు కలుపు విత్తనాలు మొలుస్తాయి. ఈ మొలిచిన కలుపును పొలంలో బాగా కలియదున్నడం ద్వారా లేదంటే కలుపు మందు ద్వారా గానీ నివారించుకోవాలి. అనంతరం వత్తి విత్తుకున్నట్లయితే కలుపు ఉధృతి తగ్గుతుంది.

కలుపు వచ్చిన తరువాత యాంత్రిక పద్ధతులు,అంతర కృషి, జీవ నియంత్రణ, రసాయన పద్దతుల ద్వారా నివారించుకోవాలి. పత్తిలో కలుపు రాకుండా ఉండడానికి విత్తే ముందు ఫ్లక్లోరాలిన్‌ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. ఇలా వీలుకానప్పుడు పత్తి విత్తిన వెంటనే పెండిమిధాలిన్‌ 30 శాతం ఎకరాకు 1.3-1.6 లీటర్లు, 200లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 15-20 రోజులకు అలాకాకుంటే 45-50 రోజులకు అరకలను ఉపయోగించి అంతరకృషి చేయడం ద్వారా కలువు నివారించుకోవాలి.

సాధారణంగా పత్తిలో అంతరకృషి చేసి మనుషుల చేత కలుపుతీయించడం వల్ల కలుపు నిర్మూలించబడి, నేల గుల్ల బారుతుంది. తద్వారా మొక్క పెరుగుదల కూడా బాగుంటుంది. కలుపు తీతకు గానీ అవకాశాలు లేనప్పుడు కలుపు మందులను వినియోగించి కలుపు నివారణ చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడడం కూలీల వేతనాలు పెరిగిన దృష్ట్వా కలుపు మందుల వాడకం పెరిగింది.

పత్తిలో విత్తిన 25-30 రోజులకు కలుపు తీతకు వీలుకానప్పుడు గడ్డిజాతి కలుపు నివారణకు, పైరథయోబ్యాక్‌ సోడియం 250 గ్రా. మరియు క్విజలోఫాప్‌ ఇథైల్‌ 400గ్రా., 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ కలువు మందులు పత్తి పైరు మీద పడినా ఏ హాని జరుగదు. అలాగే పారాక్వాట్‌ 24 శాతం 5 మి.లీ. లీటరు నీటకి కలిపి పత్తి పైరుపై పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే. పడేటట్లు పిచికారి చేయాలి.