బెంగాల్ ఓటరు ఎటువైపు : ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అవుతారా ? మమత మళ్లీ సీఎం అవుతారా ?

బెంగాల్ ఓటరు ఎటువైపు : ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అవుతారా ? మమత మళ్లీ సీఎం అవుతారా ?

Prashant Kishor : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌ శాసనసభలో హ్యాట్రిక్ కొట్టాలని తృణమూల్‌ కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో తూర్పు భారతంలోనే పెద్ద రాష్ట్రమైన బెంగాల్‌లో కాషాయ జెండా రెపరెపలాడించాలని కమలం పట్టుదలతో ఉంది.  2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న టీఎంసీ, లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో 184 స్థానాలు సాధించిన టీఎంసీ – కాంగ్రెస్ కూటమి వామపక్షాలకు అతిపెద్ద షాక్ ఇచ్చింది.

Didi

211 స్థానాలు : –

ఆ తరువాత వెనుతిరిగి చూడని దీదీ, 2016లో ఒంటరిగానే పోటీ చేసి 211 స్థానాలు సాధించి, రాష్ట్రంలో టీఎంసీని ఎదురులేని పార్టీగా నిలబెట్టారు. ఇక 2019లో జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయటంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీయేతర పార్టీలతో మెగా ర్యాలీ సైతం నిర్వహించిన దీదీ బీజేపీని ఏకాకిని చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాలకు పరిమితమై, కేవలం 44శాతం ఓట్ షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేక ప్రభావం మరోవైపు కీలకమైన నేతలు బీజేపీలో చేరడం, ఇటు మమతాబెనర్జీ మేనల్లుడిపై అసంతృప్తి పార్టీని దెబ్బతీస్తున్నాయి.

Kishore

ప్రశాంత్ కిషోర్ సేవలు : –

అయితే బీజేపీ నుంచి ఎదురవుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గతేడాదే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకుంటున్న టీఎంసీ ఎలాగైనా హ్యాట్రిక్ సాధించే లక్ష్యంతో శ్రమిస్తోంది.
మత రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్న బీజేపీకి దూరంగా ఉండాలంటూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి గట్టి బుద్ధి చెప్పాలని బెంగాలీలను దీదీ కోరుతున్నారు. మరోవైపు తృణముల్ ఇమేజ్ కు మేకోవర్ చేస్తున్న ప్రశాంత్ కిషోర్, ప్రజలకు దీదీని మరింత చేరువగా చేసే పథకాలను డిజైన్ చేస్తున్నారు.

jp nadda

కమలనాథుల వ్యూహాలు : –

గత ఐదేళ్లలో రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్నప్పటికీ తృణముల్ ఓట్ బ్యాంక్ మాత్రం చెక్కుచెదరకపోవటం విశేషం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా, శక్తిమంతమైన నేతగా మమతా తన స్థానం పదిలం చేసుకున్నప్పటికీ ఇటీవల టీఎంసీని వీడి బీజేపీలో చేరుతున్న నేతల సంఖ్య బాగా పెరగటం చూస్తుంటే ఈ ఎన్నికలు మమతకు పెద్ద సవాలుగా నిలిచాయని చెప్పక తప్పదు. మరోవైపు బీజేపీకి పంటికింద రాయిలా మారిన దీదీని ఎలాగైనా ఇంటికి సాగనంపాలనే తహతహలో కమలనాథులు తమ వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు.

left parties

వామపక్షాలతో కాంగ్రెస్ : –

తాము వామపక్షాలతో జతకడుతున్నట్టు వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ…. రానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీలకు గట్టి దెబ్బ రుచి చూపుతామని చెబుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి 76 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగిన కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించి 5.6శాతం ఓట్ షేర్ సాధించింది. మరోవైపు వామపక్ష పార్టీలు మాత్రం కనీసం ఒక్క సీటు సాధించలేక చతికిల పడ్డాయి. రానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి పెద్ద ప్రభావం చూపే అవకాశాలు లేనప్పటికీ.. లెఫ్ట్ పార్టీలు ఓటర్ బేస్ ను బీజేపీ వైపు పోకుండా అడ్డుకట్ట వేయటంపై ఫోకస్ పెడుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.