సైలెంట్ డ్రాగన్.. భారత్‌తో కయ్యానికి కారణమేంటి? అందుకే రెచ్చగొడుతుందా?

  • Published By: sreehari ,Published On : September 3, 2020 / 08:20 PM IST
సైలెంట్ డ్రాగన్.. భారత్‌తో కయ్యానికి కారణమేంటి? అందుకే రెచ్చగొడుతుందా?

దశాబ్దాల పాటు సైలెంట్‌గా ఉండి.. సడన్‌గా భారత్‌తో చైనా కయ్యానికి కాలు దువ్వటానికి కారణమేంటి? ఇండియా ఓకే.. మరి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాలన్నీ చైనాను ఎందుకు కట్టడి చేయాలని చూస్తున్నాయ్.? వీటన్నింటికి ఒకటే ఆన్సర్. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా అసమ్మతి రాగం వినిపిస్తోంది.

ఆయన నియంతగా స్థిరపడే కొద్దీ.. అదే రీతిలో పార్టీలో శత్రువులు తయారవుతున్నారు. అందుకే.. అంతర్జాతీయంగా ధృడంగా ఉంటేనే.. అంతరంగికంగా పరిస్థితిని అదుపులో పెట్టుకోవచ్చని జిన్ పింగ్ భావిస్తున్నారు. ఇదే.. ఇండియాతో క్లాష్‌కు కారణమంటున్నారు విశ్లేషకులు. ప్రపంచం మొత్తాన్ని సంక్షోభంలో పడేసిన కరోనా వైరస్‌ని నిర్మూలించడంలో చైనా ఫెయిలైంది.



ఈ విషయంలో చైనా నాయకత్వ వైఫల్యంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. ఈ సమస్యలను అధిగమించడమెలాగో చైనా నాయకత్వానికి అర్థకావండం లేదు. అందుకే.. అక్కడి దేశభక్తిని రెచ్చగొట్టి.. ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు జిన్‌పింగ్.

జిన్ పింగ్ దేశభక్తిని రెచ్చగొడుతున్నారా? :
అచ్చం ట్రంప్ లాగే.. చైనాలో తన స్థానాన్ని నిలుపుకునేందుకు.. జాత్యభిమానాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు జిన్ పింగ్. ప్రపంచంలో చైనాను.. గొప్ప దేశంగా మారుస్తున్నట్లు చెప్పుకుంటూ.. పొరుగు దేశాలతో కయ్యానికి దిగుతున్నారు. అమెరికాను ఢీకొన్ని యోధుడిగా ప్రచారం చేసుకుంటున్నారు.

2022లో.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరుగుతాయ్. డ్రాగన్ కంట్రీలోని 140 కోట్ల మంది.. సినిమా చూడటమే తప్ప.. ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వాన్ని ఎన్నుకునేదేమీ ఉండదు. ఐతే.. దేశ ప్రజలను ఆకట్టుకుంటే వ్యతిరేకత రాదు. గొడవలు చెలరేగవు. దీనివల్ల అసమ్మతివాదులకు అవకాశం దొరకదనేది జిన్ పింగ్ టాక్టిక్. పార్టీ సీనియర్లను మచ్చిక చేసుకుంటూ.. తానే కొనసాగడానికి జిన్ పింగ్ ఎత్తులు వేస్తున్నాడు.



దక్షిణచైనా సముద్ర ప్రాంతంలో చిన్న దేశాలను బెదిరించి.. చైనా హడావుడి చేస్తోంది. రక్షణ సామగ్రి కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. హాంకాంగ్ నిరసనలను క్రూరంగా అణచివేస్తోంది. ప్రపంచమంతా ఒకవైపు, చైనా మరో వైపు అన్నట్టుగా హంగామా నడుస్తోంది. దీంతో.. ప్రపంచంలోనే దృఢమైన నాయకుడిగా జిన్‌పింగ్‌ ప్రచారం చేసుకుంటున్నారు.

ప్రజలంతా.. ఆయన వెంటే ఉండాలనే ప్రచారం సాగుతోంది చైనాలో. కానీ.. పరిస్థితి చూస్తే అమెరికాతో.. చైనా వైరం ముదిరింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండియా, కజకిస్థాన్‌ లాంటి దేశాలతో విభేదాలు పెరిగిపోతున్నాయ్. 20వ పార్టీ మహాసభలో బలబలాలు తేల్చుకునేందుకు సమాయత్తం కావడం ఇప్పుడే మొదలవుతోంది. పైకి అనుకున్నంత ప్రశాంతంగా లేదు. లోలోపల జిన్ పింగ్ వైఖరి పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే.. 2050 వరకు చైనాను ప్రపంచంలోనే బలమైన శక్తిగా తీర్చిదిద్దుతానని ప్రచారం చేసుకుంటున్నారు జిన్ పింగ్.

అసమ్మతి కాదా?.. జిన్ పింగ్ శత్రువులేనా? :
వాస్తవానికి.. చైనాలో ఇప్పుడున్నది అసమ్మతి కాదు. జిన్ పింగ్ శత్రువులు. కమ్యూనిస్టు పార్టీ ఉన్నత స్థానాల్లో కూడా ఆయనకు శత్రువులు తయారయ్యారు. పార్టీ నాయకుడిని.. దాదాపు 2 వందల మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్నుకుంటారు. దేశాధ్యక్షుడిని చట్టసభ సభ్యులు ఎన్నుకుంటారు. అంతా మొక్కుబడి వ్యవహారమే.. రెండు పదవులకు జిన్ పింగ్ ఎన్నికవుతారు. ఐతే.. ఈ మధ్య కాలంలో.. చైనాలోని మేధావి వర్గం జిన్‌పింగ్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తోంది.



అందుకే.. తన పట్ల వచ్చిన వ్యతిరేకతను తగ్గించుకునేందుకు జిన్ పింగ్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. జిన్ పింగ్ టీమ్ కూడా ఆయనను ప్రశంసిస్తూ.. మద్దతివ్వాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సైద్ధాంతిక పత్రిక కియూ షి కూడా.. ఇటీవల జిన్ పింగ్ కి మద్దతివ్వాలంటూ పిలుపు నిచ్చింది. కేంద్ర కమిటీకి.. జిన్ పింగ్ మూల స్తంభమని రాసుకొచ్చింది. జిన్ పింగ్ రాసిందంటూ.. ఓ వ్యాసాన్ని కూడా పబ్లిష్ చేసింది. ఇందులో.. 2035 వరకు పార్టీ ఆర్థిక లక్ష్యాలను వివరించారు జిన్ పింగ్.



ఇండియాతో బోర్డర్ క్లాష్ కూడా జిన్ పింగ్ ఎజెండాలోనిదే. తనపై వచ్చిన వ్యతిరేకతను.. దేశభక్తి, సరిహద్దు వివాదాలపై మళ్లించేందుకు.. LAC వెంట ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. కావాలనే.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. చైనా ప్రజలందరి అటెన్షన్‌ని.. ఇండియా వైపు మళ్లిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. అసలు సమస్య చైనాతో కాదు.. జిన్‌పింగ్‌తోనేనని విశ్లేషకులు చెబుతున్నారు.