China Spy Ship in Srilanka Port : భారత్‌ పై చైనా మరో భారీ కుట్ర..చైనా నుంచి శ్రీలంకకు నిఘా నౌక

చైనా భారత్ మీద భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది. ఓ నిఘా షిప్‌ను శ్రీలంక పోర్టుకు పంపించబోతోంది. షిప్‌ను అక్కడికి పంపిస్తే.. భారత్‌కు ఎందుకు టెన్షన్‌ ? అసలు ఆ షిప్ ప్రత్యేకతలు ఏంటి.. ఆ నౌక ద్వారా చైనా ఏం చేయబోతోంది..?

China Spy Ship in Srilanka Port : భారత్‌ పై చైనా మరో భారీ కుట్ర..చైనా నుంచి శ్రీలంకకు నిఘా నౌక

China Spy Ship ‘Yuan Wang 5’ in Srilanka Port : విస్తరణవాద కాంక్షతో రెచ్చిపోతున్న చైనా.. చేయని నీచపు పని లేదు. సరిహద్దుల్లో నక్కబుద్ధులు చూపిస్తోంది. అలాంటి డ్రాగన్ ఇప్పుడు భారత్ మీద మరోసారి అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం చేస్తోంది. భారీ కుట్రకు సిద్ధం అవుతోంది. ఓ నిఘా షిప్‌ను శ్రీలంక పోర్టుకు పంపించబోతోంది. షిప్‌ను అక్కడికి పంపిస్తే.. భారత్‌కు ఎందుకు టెన్షన్‌ ? అసలు ఆ షిప్ ప్రత్యేకతలు ఏంటి.. ఆ నౌక ద్వారా చైనా ఏం చేయబోతోంది..

ఇంతకుమించి దిగజారదు అనుకున్న ప్రతీసారి.. అది రాంగ్‌ అని ప్రూవ్ చేస్తూనే ఉంది చైనా. చర్చలు అంటూనే.. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దు గ్రామాల్లో నిర్మాణాలు చేపడుతోంది. భారత్‌తో మాత్రమే కాదు.. అన్ని దాయాది దేశాలతో అదే తీరుగా ఉంది చైనా తీరు. భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడం.. దెబ్బతినటం.ఆ తర్వాత మళ్లీ మొదటి నుంచి చేయడం.. కొన్నాళ్లుగా చైనా చేస్తోంది ఇదే ! అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటనను సాకుగా చేసుకుని డ్రాగన్.. ఇప్పుడు తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. యుద్ధ విన్యాసాల పేరుతో ఏకకాలంలో తన ప్రత్యర్థులందరినీ హడలెత్తించడమే కాకుండా.. భారత్‌పై నిఘా పెడుతోంది. ఓ నిఘా షిప్‌ను పంపించి.. తన నీచపు బుద్ది బయటపెట్టుకునే ప్రయత్నం చేస్తోంది..

చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్​ 5.. శ్రీలంకలోని హంబన్‌టొట నౌకాశ్రయం వైపు వెళ్తోంది. గంటకు 35.2 కిలోమీటర్ల వేగంతో వస్తున్న షిప్‌.. ఈ నెల 11నాటికి నాటికి.. హంబన్‌టొట పోర్టుకు చేరుకోబోతోంది. 11 నుంచి 17 వరకు అది ఆ నౌకాశ్రయంలోనే ఉంటుంది. శ్రీలంక రక్షణ మంత్రిత్వశాఖ ఇప్పటికే దీన్ని ధ్రువీకరించింది. ఆయిల్‌ రీఫిల్లింగ్‌ కోసమే అంటూ చైనా చెబుతున్నా.. దాని వెనుక వ్యూహం మాత్రం మరొకటి ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిఘా నౌకకు లంక పోర్టులో లంగరు వేయడం వెనక భారత్‌ను టార్గెట్ చేయడమే డ్రాగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. సరిహద్దుల్లో డ్రాగన్‌గాళ్ల ఓవరాక్షన్‌కు.. భారత్ ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతోంది. దీంతో భారత్‌ బలాలను, బలగాలను తెలుసుకునేందుకు.. చైనా కుట్ర చేస్తుందని.. అందులో భాగంగానే యువాన్‌ వాంగ్‌ నౌకను పంపుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

యువాన్‌ వాంగ్‌ నౌక.. 222 మీటర్ల పొడవు, 25.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. బరువు 25వేల టన్నులు. దీని నిఘా పరిధి 750 కిలోమీటర్ల వరకు ఉంటుంది. క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల ట్రాకింగ్‌ చేయగలదు. సుదూర ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. దీంతో కల్పకం, కూడంకుళం న్యూక్లియర్‌ పరిశోధన కేంద్రాలతో పాటు.. కేరళలోని సదరన్‌ నేవల్‌ కమాండ్‌ కూడా షిప్ నిఘా నేత్రం పరిధిలోకి వస్తాయ్. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా నేత్రం ఉంచగలదు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన సంస్థల కీలక సమాచారాన్నీ సేకరించగలదు. ఇదే ఇప్పుడు మరింత టెన్షన్ పెడుతోంది.

మొత్తం 4 వందల మంది సిబ్బంది.. యువాన్ వాంగ్‌ నౌకలో ఉంటారు. దీన్ని చైనా అంతరిక్ష విభాగంతో పాటు సైనిక విభాగం అధికారులు కంట్రోల్‌ చేస్తుంటారు. అత్యంత అధునాతన టెక్నాలజీ ఇందులో ఉండటంతో… ఈ నౌక ద్వారా ఒడిశా తీరం వెంబడి వీలర్ ఐలాండ్‌లో భారత్ చేపట్టే బాలిస్టి‌క్ క్షిపణి ప్రయోగాలను అంచనా వేయడానికి, వాటి సామర్థ్యంపై పూర్తి వాస్తవ స్థాయి సమాచారాన్ని రాబట్టుకోవడానికి డ్రాగన్‌కు వీలవుతుంది. అంటే భారత క్షిపణుల రేంజ్‌ను కచ్చితంగా అంచనా వేయడానికి ఈ నౌక ద్వారా చైనాకు వీలు చిక్కుతుంది. చైనాకు చెందిన ఈ నౌకను శ్రీలంక అనుమతించడంపై భారత్ ఆందోళనగా ఉంది.

హంబన్‌టొట పోర్టులో నిఘా నౌక ఐదు రోజుల పాటు హాల్ట్‌ చేయడం అంటే.. అది కచ్చితంగా భారత్‌ను టార్గెట్‌ చేయడమే ! హంబన్‌టొట నౌకాశ్రయానికి భారత భూభాగం కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దొంగదారిలో ఎంటర్‌ కావడం.. అలాంటి దారిలోనే వివరాలు తెలుసుకోవడం చైనాకు కొత్తేం కాదు ! ఆ మధ్య డ్రాగన్‌గాళ్లు.. మన ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా మన రక్షణ వ్యవస్థను టార్గెట్‌ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఆరా తీసేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.. శ్రీలంకపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా.. అది పెద్దగా పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు.