Aurangzeb: ఔరంగజేబ్‌ని కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు.. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది.. అసలేంటీ వివాదం?

ఔరంగాబాద్‌ పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చిన తర్వాతే.. ఈ తరహా మత ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Aurangzeb: ఔరంగజేబ్‌ని కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు.. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది.. అసలేంటీ వివాదం?

Aurangzeb Controversy in Maharashtra

Aurangzeb Controversy Maharashtra ఔరంగజేబ్.. అతను చనిపోయి 3 శతాబ్దాలైంది. కానీ.. ఇప్పటికీ అతని పేరు మహారాష్ట్ర రాజకీయాల్లో ఉనికిలోనే ఉంది. పోలీసులు, రాజకీయ నాయకులను టెన్షన్ పెడుతూనే ఉంది. మహారాష్ట్రలో కొన్ని నెలలుగా మొఘల్ చక్రవర్తి (Mughal Emperor) ఔరంగజేబ్‌ని కీర్తిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు, పోస్టర్లు వెల్లువెత్తుతున్నాయ్. అవి.. బంద్‌లకు పిలుపునిచ్చే దాకా వెళుతున్నాయ్. తర్వాత.. హింసకు దారితీస్తున్నాయ్. కొన్ని రోజులుగా.. కొల్హాపూర్(Kolhapur), అహ్మద్ నగర్ (Ahmednagar), ధులే(Dhule), నాసిక్‌(Nashik)లో ఇదే జరుగుతూ వస్తోంది. అసలేంటీ వివాదం? ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారు? ఇంతకీ.. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?

మహారాష్ట్రలోని కొల్హాపూర్, అహ్మద్‌నగర్‌లో కొందరు యువకులు పెట్టిన వాట్సాప్ స్టేటస్‌తో.. ఈ చిచ్చు రేగింది. వాళ్లు.. ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్‌ని కీర్తిస్తూ స్టేటస్ పెట్టడంతో.. కొత్త వివాదం చెలరేగింది. అవి వైరల్‌గా మారడంతో.. ఓ హిందూ సంస్థ.. నిరసనలకు పిలుపునిచ్చింది. దాంతో.. రెండు మత సమూహాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఆ తర్వాత.. గత కొన్నేళ్లలో మహారాష్ట్రలో మతపరమైన రాజకీయాలు ఎక్కువయ్యాయనే ఆందోళన వ్యక్తమైంది. బీజేపీ-శివసేన ప్రభుత్వ కనుసన్నల్లో.. గతేడాది చివర్లో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌కు వ్యతిరేకంగా.. పట్టణ కేంద్రాల్లో నిర్వహించిన హిందూ జన్ ఆక్రోశ్ మోర్చా ర్యాలీల తర్వాత.. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం ఎక్కువైంది. వచ్చే ఏడాది సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను పోలరైజ్ చేసేందుకే.. మత వైషమ్యాలను రెచ్చగొడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. మరోవైపు ఉద్రిక్తతలను పెంచడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

శాంతి, స్నేహపూర్వక సంబంధాలకు పేరుగాంచిన మహారాష్ట్రలో.. ఇప్పుడు పట్టణాల్లో నెలకొన్న పరిస్థితులు.. ఆందోళన పెంచుతున్నాయి. సోషల్ మీడియాలోని ఓ పోస్ట్, ఓ వాట్సాప్ స్టేటస్.. రాష్ట్రంలో బంద్‌లకు, హింసాకాండకు కారణమవుతుందంటే.. అస్సలు నమ్మశక్యంగా లేదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో.. ఇంతకంటే దారుణమైన మతపరమైన సంఘటనలు జరిగినప్పుడు కూడా మహారాష్ట్ర చాలావరకు శాంతియుతంగా ఉంది. కానీ.. ఇప్పుడు ఎవరో కావాలనే.. శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా.. కమ్యూనిటీలను రెచ్చగొడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గడిచిన 3 నెలల్లో.. మహారాష్ట్రోలని 8 నగరాల్లో తరచుగా మత ఉద్రిక్తతలు, హింస చోటు చేసుకున్నాయి. శంభాజీ నగర్‌, అకోలా, షిగావ్‌, శెంగమ్నర్‌, జలగావ్‌, ముంబై, కొల్హాపూర్‌లో.. ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇవి చోటు చేసుకుంటున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొల్హాపూర్‌ ఉద్రికత్తలకు సంబంధించి.. పోలీసులకు, ప్రభుత్వానికి ముందస్తు సమాచారమున్నా.. వాటిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.

Also Read: రూ.8.4 కోట్ల దోపిడీ కేసు.. 10 రూపాయల డ్రింక్ సాయంతో డాకు హసీనాను పట్టుకున్న పోలీసులు

ఔరంగాబాద్‌ పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చిన తర్వాతే.. ఈ తరహా మత ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చడం.. అల్లర్లు చెలరేగడానికి ఓ కారణమై ఉండొచ్చు. అయితే.. ప్రభుత్వ పెద్దలు చారిత్రక తప్పిదాలను రద్దు చేసేందుకు.. మహారాష్ట్రలో ఔరంగజేబ్ ప్రస్తావన మొత్తాన్నే తుడిచిపెట్టేందుకు.. ఓ ఎత్తుగడగా దీనిని రూపొదించారనే ప్రచారాలున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని.. మహా వికాస్ అఘాడీ సర్కార్ ప్రణాళికలోనే ఈ పని ఉన్నప్పటికీ.. గత ఫిబ్రవరిలో.. బీజేపీ-శివసేన ప్రభుత్వం ఈ విషయంలో తన ముద్ర వేసిందని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: గాంధీ శాంతి బహుమతితో వచ్చే కోటి రూపాయల నగదు బహుమానాన్ని తిరస్కరించిన గీతా ప్రెస్

1680లలో.. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం, ఔరంగజేబ్ మొత్తం దక్కన్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు మరో ప్రచారాన్ని ప్రారంభించాడు. అతను.. తన తండ్రి అయిన చక్రవర్తి షాజహాన్‌కు.. ఈ ప్రాంతానికి వైస్రాయ్‌గా ఉన్నప్పటి నుంచి ఇది అతని కల. తన న్యాయస్థానాన్ని కూడా ఔరంగబాద్‌కు తరలించాడు. తర్వాత.. వరుసగా దండయాత్రలు మొదలుపెట్టాడు. అయితే.. దక్కన్‌ని జయించాలనే అతని కల.. మొఘల్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచిందని చరిత్రకారులు చెబుతున్నారు.

Also Read: స్వర్ణ దేవాలయం గుర్బానీ వివాదం.. చట్ట సవరణ చేస్తామని సీఎం సంచలన ప్రకటన.. జోక్యం చేసుకుంటే బాగుండదని సిక్కు సంఘం వార్నింగ్

ఔరంగజేబ్ మరణం తర్వాత.. అతని పేరు పెట్టబడిన ఔరంగాబాద్ సమీపంలోని ఖుల్దాబాద్‌లో.. అతన్ని ఖననం చేశారు. అయినప్పటికీ.. ఈ ప్రాంతంలోని ముస్లింలకు.. సాంస్కృతిక, మతపరమైన వ్యక్తిగా ఔరంగజేబు లేడని చెబుతున్నారు. అతను.. ముస్లింల చేత ఆరాధించబడలేదని అంటున్నారు. ఎవరి ప్రయోజనాల కోసమో.. కొన్ని వర్గాలను రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఔరంగజేబును కీర్తిస్తూ వచ్చిన పోస్టులకే.. ఈ స్థాయిలో రియాక్షన్లు ఉంటే.. నాథూరామ్ గాడ్సేను కీర్తించినప్పుడు అలాంటి రియాక్షన్ ఎందుకు కనిపించలేదనే ప్రశ్నలు సంధిస్తున్నారు. అందువల్ల.. తరచుగా జరుగుతున్న అల్లర్ల వల్ల మహారాష్ట్రలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ఇది.. మరాఠా రాష్ట్ర ప్రతిష్టను మసకబారుస్తోందని చెబుతున్నారు.