UP cops: భర్తను తప్పించేందుకే ఎస్సైతో వాగ్వాదం.. వైరల్ వీడియోపై పోలీసుల క్లారిటీ!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఒక పోలీసు అధికారికి మహిళకు మధ్య జరిగిన గొడవ దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఓ మహిళపై ఎస్‌ఐ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

UP cops: భర్తను తప్పించేందుకే ఎస్సైతో వాగ్వాదం.. వైరల్ వీడియోపై పోలీసుల క్లారిటీ!

Up Kanpur

Kanpur Rural: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఒక పోలీసు అధికారికి మహిళకు మధ్య జరిగిన గొడవ దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఓ మహిళపై ఎస్‌ఐ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టగా.. కాన్పూర్ గ్రామీణ పోలీసులు ఓ వివరణ ఇచ్చారు. మహిళ పట్ల ఓ ఎస్సై దురుసుగా వ్యహరించారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా క్లారిటీ ఇచ్చారు పోలీసులు.

ఆర్తి అనే మహిళ భర్త పేకాట ఆడుతుండగా పట్టుకునేందుకు వచ్చిన పోలీసులను అడ్డుకుందని, ఆ సమయంలో ఎస్‌ఐని ఆమెనే కింద పడేసినట్లుగా పోలీసులు వివరణ ఇచ్చారు. ఎస్సై ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం అని ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాన్పూర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగ్నిపూర్ ప్రాంతంలో దుర్గాదాస్‌పూర్ గ్రామానికి పోలీసు అధికారుల బృందం వెళ్లినప్పుడు, కొంతమంది వ్యక్తులు జూదం ఆడుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బాధిత మహిళ ఆర్తి మాట్లాడుతూ.. పేకాట ఆరోపణలతో తన భర్తను అరెస్ట్ చేశారని, అతన్ని విడిచి పెట్టాలంటే లంచం ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేసినట్లుగా ఆర్తి ఆరోపించారు. ‘అతను నన్ను చెంపదెబ్బ కొట్టాడు. ఈడ్చుకెళ్లి కింద పడేశాడు. నా మీద కూర్చొన్నాడు. మధ్యలో మా గ్రామస్తులు జోక్యం చేసుకుని కాపాడారు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


అయితే, కాన్పూర్ ఎస్పీ కేశవ్ చౌదరి మాత్రం.. ఆర్తి భర్త యాదవ్, అతని స్నేహితులు పేకాట ఆడుతుంటే పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో యాదవ్ భార్య ఆర్తి, అతని తల్లి ఎస్సై పటేల్‌కు అడ్డుపడ్డారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆర్తి కిందపడిందని వెల్లడించారు. యాదవ్‌ను అక్కడినుంచి పారిపోయేలా చేసేందుకే వారు అడ్డుపడ్డారని, ఈ క్రమంలో స్వల్ప ఘర్షణ జరిగిందని, ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

ఇదే ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. మహిళపై దౌర్జన్యం చేసిన పోలీస్ అధికారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు రాష్ట్రంలో మహిళా భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయంటూ విమర్శించారు.