Yediyurappa : బొమ్మై మంత్రివర్గంలో అసమ్మతి..ఆ హోదా తనకు అక్కర్లేదన్న యడియూరప్ప

తనకు కేబినెట్​ హోదాను కేటాయిస్తున్నట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప కోరారు.

Yediyurappa : బొమ్మై మంత్రివర్గంలో అసమ్మతి..ఆ హోదా తనకు అక్కర్లేదన్న యడియూరప్ప

Karnataka

Yediyurappa తనకు కేబినెట్​ హోదాను కేటాయిస్తున్నట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప కోరారు. ఈ మేరకు సీఎంకి ఆదివారం యడియూరప్ప ఓ లేఖ రాశారు. సీఎంకి రాసిన లేఖలో యడియూరప్ప.. మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చే వసతులను మాత్రమే నాకు కల్పించాలని మిమ్మల్ని కోరుతున్నాను. నాకు ఇచ్చిన కేబినెట్ ర్యాంకు హోదాను ఉపసంహరించుకోండి అని లేఖలో యడియూరప్ప పేర్కొన్నారు.

కాగా,కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పకు కేబినెట్‌ హోదా తరహా సౌకర్యాలు- కేబినెట్‌ మంత్రి మాదిరిగా జీతభత్యాలు, ప్రభుత్వ వాహనం, అధికార నివాసం వంటి సౌకర్యాలు కొనసాగించాలని బొమ్మై సర్కార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీఎం బసవరాజ్ బొమ్మై ఆ పదవిలో ఉన్నంత వరకు యెడియూరప్పకు కేబినెట్‌ హోదా సౌకర్యాలు అందుతాయని కర్ణాటక ప్రభుత్వ సిబ్బంది, పరిపాలనా సంస్కరణల విభాగం (DPAR) ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే,జులై 26న తన రెండేళ్ల పాలన పూర్తైన వేళ కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జులై 28న బసవరాజ్​ బొమ్మై.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే 29 మంది సభ్యులతో ఆయన మంత్రివర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మంత్రివర్గ విస్తరణలో యడియూరప్ప కుమారుడికి చోటు లభించని విషయం తెలిసిందే.

శాఖల కేటాయింపుపై మంత్రుల అసంతృప్తి..స్పందించిన సీఎం

మరోవైపు, బొమ్మై కొలువులో అమాత్యులకు ఆశించిన శాఖలు దక్కక పోవడంతో శనివారం అసమ్మతి స్వరం ప్రతిధ్వనించింది. తమకు ప్రాధాన్యం లేని శాఖలను కేటాయించారంటూ ఆనంద్ సింగ్,ఎంటీబీ నాగరాజ్ సహా కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాఖల కేటాయింపుపై కొంతమంది మంత్రుల అసంతృప్తి వ్యక్తం చేయడంపై శనివారం సీఎం బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కోరుకున్న శాఖలను పొందలేరని వ్యాఖ్యానించారు. తాను ఆనంద్ సింగ్‌తో మాట్లాడాననని..అతని సమస్యను త్వరలో పరిష్కరిస్తానని అనుకుంటున్నానన్నారు. ఎంటీబీ నాగరాజ్‌కు కాల్ చేసి అతనితో కూడా మాట్లాడతానని బొమ్మై తెలిపారు. కొత్తగా మంత్రివర్గం ఏర్పడినప్పుడు కొందరు నేతల్లో ఇటువంటి అసంతృప్తి సహజమేనని బొమ్మై తెలిపారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే అందరికీ న్యాయం చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. మాజీ ప్రధాని కావడంతోనే దేవేగౌడతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానని స్పష్టం చేశారు.